Mahesh Babu: ట్రిపుల్ ఆర్‌ని మించేలా రాజ‌మౌళి- మ‌హేష్ చిత్రం

Mahesh Babu: ఆలు లేదు.. సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అంటారు కదా..? ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళి సినిమాను చూస్తుంటే కూడా ఇదే అనిపిస్తుంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు వేయి కళ్ళతో వేచి చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆ సినిమా గురించి ఎలాంటి వార్త వినిపించిన కూడా వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. మరోవైపు రాజమౌళి, మహేష్ సినిమాపై రోజుకో వార్త సోషల్ మీడియాలో పుట్టుకొస్తుంది. దాన్ని ఖండించేవారు లేకపోవడంతో సినిమాపై ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. మొన్నటి వరకు ఇది జేమ్స్ బాండ్ తరహా సినిమా అని.. ఈ నేపథ్యంలోనే విజయేంద్రప్రసాద్ కథ కూడా సిద్ధం చేశాడు అంటూ ప్రచారం జరిగింది. కానీ మొన్న అలీతో సరదాగా షోకు వచ్చినపుడు మహేష్ బాబు కోసం ఎలాంటి కథ రాస్తారంటే.. నా వల్ల కాదంటూ సమాధానమిచ్చాడు విజయేంద్ర ప్రసాద్.

అంటే ఇప్పటి వరకు కథ సిద్ధం కాలేదని అర్థమవుతుంది. మొన్నటి వరకు ఏజెంట్ పాత్ర అని వచ్చినా కూడా.. ఈ మధ్యే మరో వార్త బయటికి వచ్చింది. ఇందులో మహేష్ చత్రపతి శివాజీ పాత్రలో నటించబోతున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం మహేష్ బాబు అభిమానులను గాల్లో తేలిపోయేలా చేస్తుంది. ఈ సినిమాలో శివాజీ పాత్రలో మహేష్ నటిస్తున్నాడా లేదా అనేది పక్కన పెడితే ఒకటి మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. అదేంటంటే ఈ చిత్ర షూటింగ్ ఎక్కువగా ఆఫ్రికా అడవుల్లో జరగనుంది. దీనికోసం ఇప్పటికే రాజమౌళి యూనిట్ సభ్యులు లోకేషన్స్ వేట కూడా మొదలుపెట్టారు. మరోవైపు ఈ సినిమా బడ్జెట్ కూడా ఇప్పుడు సంచలనంగా మారుతుంది. దీనికోసం ఏకంగా 500 కోట్లు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ట్రిపుల్ ఆర్ కంటే ఎక్కువ బడ్జెట్ అన్నమాట.

ట్రిపుల్ ఆర్ అయిపోతే తన పూర్తి ఫోకస్ మొత్తం మహేష్ బాబు సినిమాపై పెట్టనున్నాడు రాజమౌళి. సీనియర్ నిర్మాత కె.ఎల్.నారాయణ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించబోతున్నాడు. అయితే ఈ సినిమాపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు కాబట్టి ఎన్ని వచ్చినా కూడా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలే.. అవన్నీ నమ్మాల్సిన పనిలేదంటున్నారు మహేష్ బాబు అభిమానులు. ఇది ఎలాంటి జోనర్ అయినా కానీ.. ఎలాంటి సినిమా అయినా కానీ.. ఎన్నో ఏళ్లుగా అటు రాజమౌళి.. ఇటు మహేష్ బాబు అభిమానులు వేచి చూస్తున్న సినిమా. అందుకే దీని గురించి ఏ వార్త వచ్చినా కూడా అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రస్తుతం పరశురామ్ సర్కారు వారి పాట, త్రివిక్రమ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు మహేష్ బాబు. ఇవి అయిపోయిన తర్వాత రాజమౌళి సినిమాపై దృష్టి పెట్టనున్నాడు.