కిడ్నీ మార్పిడి విషయం నిజమే.. రజనీకాంత్ అఫీషియల్ ప్రకటన
Samsthi 2210 - October 29, 2020 / 02:02 PM IST

సూపర్ స్టార్ రజనీకాంత్‌ని అభిమానించే అభిమానులు కొన్ని లక్షలలోనే ఉంటారు. ఆయనని నటుడిగా కాకుండా, తమ సొంత కుటుంబ సభ్యుడిగా భావిస్తూ ఎంతో ప్రేమని పంచుతుంటారు. రజనీకాంత్ అనారోగ్యానికి గురయ్యాడని వార్తలు వస్తే అభిమానులు ఎంతో మనోవేదనకు గురవుతుంటారు. ఈ నేపథ్యంలో బుధవారం రోజు ఆయన రాజకీయాలకి సంబంధించిన విషయాలతో పాటు ఆరోగ్యం విషయాలతో కూడిన ఓ లెటర్ సోషల్ మీడియా చక్కర్లు కొట్టింది. రజనీకాంత్ తన అభిమానులని ఉద్దేశించి రాసిన లెటర్ ఇది అంటూ జోరుగా ప్రచారం జరగగా, దీనిని సూపర్ స్టార్ తన సోషల్ మీడియా ద్వారా ఖండించారు.
రాజకీయాలలోకి సరైన సమయం చూసుకొని వస్తాను అని తాజాగా రజనీకాంత్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. రజిని మక్కల్ మంద్రం సభ్యులతో చర్చలు జరిపిన తర్వాత పొలిటికల్ ఎంట్రీపై ఓ క్లారిటీ ఇస్తాను అని తలైవా స్పష్టం చేశారు. ఇక తన ఆరోగ్యంకు సంబంధించిన విషయాలు గురించి మాట్లాడుతూ.. ఆ లేఖలో పేర్కొన్నవన్నీ వాస్తవాలే అని చెప్పుకొచ్చారు.
రజనీకాంత్ పేరుతో చక్కర్లు కొట్టిన లేఖలో మదురైలో అక్టోబర్ 2న భారీసభ నిర్వహించి పార్టీ పేరు జెండా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నాను. కానీ అదే సమయంలో కరోనా ఎంటర్ కావడంతో విరమించుకున్నాను. 2011లో కిడ్నీ సమస్య తో బాధపడ్డ నేను సింగపూర్‌లో వైద్యం చేయించుకున్నాను. 2016లో ఆ సమస్య మళ్ళీ రావడంతో అమెరికా వెళ్లి మార్పిడి చేసుకున్నా. ఈ విషయం నా సన్నిహితులకు మాత్రమే తెలుసు. నాకు కిడ్నీ మార్పిడి జరగడం వలన రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది.కరోనా వ్యాక్సిన్ ఇంకా రాలేదు కాబట్టి రిస్క్ చేయాలనుకోవడం లేదు. నాకు ప్రాణభయం లేదు. చుట్టూ ఉన్నవారి కోసమే ఆలోచిస్తున్నా. డిసెంబర్‌లో దీనిపై ప్రకటన చేస్తాను అని లీకైన లెటర్‌లో ఉంది.