Sunitha: సునీత వ‌ల్ల‌నే నేను ఆత్మ‌హ‌త్య చేసుకోలేదు.. ఎమోష‌న‌ల్ అయిన అభిమాని

Sunitha:యాంక‌ర్‌గా, సింగ‌ర్‌గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా కొన్ని ద‌శాబ్ధాల నుండి తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది సునీత‌. త‌న భ‌ర్త‌తో విడాకులు తీసుకున్న సునీత త‌న పిల్ల‌ల బాధ్య‌త‌ల‌ను పూర్తిగా తానే చూసుకుంది. ఆమె జీవితంలో ప‌డ్డ క‌ష్టాల గురించి విన్న‌వారు క‌న్నీటి ప‌ర్యంతం కాకుండా ఉండ‌రు. చాలా ఏళ్ల నుండి సోలోగో ఉంటూ వ‌చ్చిన సునీత ఈ ఏడాది మొద‌ట్లో రామ్ అనే పారిశ్రామిక వేత్త‌ని రెండో వివాహం చేసుకుంది.

Sunitha
Sunitha

రెండో పెళ్లి త‌ర్వాత సునీత నిత్యం హెడ్ లైన్స్‌లో నిలుస్తూ వ‌స్తుంది. ఎక్కువ‌గా ఆమె ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌తోనే సునీత అంద‌రి దృష్టి ఆక‌ర్షిస్తుంది. ఈ మ‌ధ్య త‌న భ‌ర్త‌తో దిగిన ఫోటో షేర్ చేయ‌గా, దానిపై కొంద‌రు త‌ప్పుడు కామెంట్స్ చేశారు. దీనికి సునీత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇక రీసెంట్‌గా భర్త చేతిలో చెయ్యేసి ఓ అపురూప చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట హల్‌చల్‌ అవుతుంది.

రామ్‌ వీరపనేని అనే వ్యాపారవేత్తను రెండో వివాహం చేసుకున్న సునీత ఇటు కెరీర్‌ను, అటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్‌ చేస్తూ వస్తుండ‌గా, ఆమె జీవితం ఎంతో మందికి ఆద‌ర్శంగా నిలిచింది. సింగర్ సునీత ఫ్యాన్స్ (ఎస్ఎస్ఎఫ్) పేరుతో సోషల్ మీడియాలో ఓ పేజీ ఉండ‌గా అందులో అభిమాని చేసిన పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

సునీత ఉపద్రష్ట.. ఓ స్పూర్తిప్రదాత అంటూ ఎస్ఎస్ఎఫ్‌లో మెంబర్ అయిన ఇందిరా ప్రియదర్శిని అనే అమ్మాయి తన జీవితం గురించి, తన జీవితంలో సునీత పాత్ర గురించి చెప్పుకొచ్చారు. ” నాకు ప్రాణభిక్ష పెట్టిన దేవత సునీత గారు.. ఆమె పాట మనస్సుకి ప్రశాంతతనిస్తే.. ఆమె మాట మనిషికి ప్రాణం పోసింది.. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం ఆమె ‘‘అలవాటు’’.. (కుడిచేయితో చేసిన సహాయం ఎడమ చేతికి కూడా తెలియనివ్వరు). ఆమెలో ఉన్న ఆత్మ విశ్వాసం నాలో నింపి నేను ఆత్మహత్య చేసుకోకుండా చేసింది..

ఆవిడ పలకరింపు.. (మన సొంత ఇంటి వ్యక్తి కూడా అంత స్వచ్చంగా ఉండదేమో) అప్పుడే పుట్టిన పిల్లల నవ్వులా ఉంటుంది.. ఆవిడ పక్కన ఉంటే ఆమె చుట్టూ ఉండే పాజిటివ్ ఆరానే చెప్ప్తుంది సునీత గారి మనస్సు.. ఆవిడ ఎంతో మందికి ఆదర్శం.. ఆవిడ ఎంతో మందికి ధైర్యం.. ఆవిడ పాట ఎన్నో మనస్సులకి ప్రశాంతత.. ఆవిడ నాకు దేవుడు పంపిన బహుమతి” అంటూ పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన సునీత త‌న‌పై ఇంత న‌మ్మ‌కం ఉంచినందుకు ధ‌న్యవాదాలు తెలిపింది.