KTR: నేను కాదు రియ‌ల్ హీరో, సోనూసూద్ అస‌లైన రియ‌ల్ హీరో అంటూ కేటీఆర్ కామెంట్

KTR విల‌న్‌గా వెండితెర‌ పై అల‌రించి ప్రేక్ష‌కాభిమానం పొందిన సోనూసూద్ గ‌త ఏడాది నుండి దేశానికి ఎంతో సేవ చేస్తున్నాడు. క‌రోనా ప్ర‌ళ‌యం వ‌ల‌న చాలా మంది జీవితాలు దుర్భ‌రంగా మార‌డంతో ఎంతో మందికి అండ‌గా నిలిచాడు. వ‌ల‌స కూలీల దగ్గర నుండి విదేశాల‌లో చిక్కుకున్న విద్యార్ధుల‌ని తీసుకొచ్చే వ‌ర‌కు సోనూసూద్ చేసిన కృషి అమోఘం. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ స‌మ‌యంలో ఆక్సిజ‌న్ అంద‌క చాలా మంది మృతి చెందుతున్నార‌న్న విష‌యం తెలుసుకున్న సోనూసూద్ ప్ర‌త్యేకంగా ఆక్సిజ‌న్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తుండ‌డంతో పాటు అవ‌స‌రమైన వారికి కాన్స‌న్‌ట్రేట‌ర్స్‌ని పంపిస్తున్నారు.

KTR Praises Sonu Sood

రెండు తెలుగు రాష్ట్రాల్లో మృత‌దేహాల సంర‌క్ష‌ణ కోసం మార్చురీ డెబ్ బాడీ ఫ్రిజ‌ర్ బాక్సుల‌ను సోను అందిస్తున్నారు. సంకిరెడ్డి ప‌ల్లి, ఆషా పూర్ బోంకూర్‌, ఓర్వ‌క‌ల్‌, మ‌ద్దికెర స‌హా ఇత‌ర గ్రామాల్లో ఫ్రీజ‌ర్ బాక్సులు అందుబాటులో లేక‌పోవ‌డంతో ఆ గ్రామ స‌ర్పంచులు స‌హాయం కోసం సోనూసూద్‌ను సంప్ర‌దించారు. దీంతో వెంట‌నే ఆయ‌న స్పందించి అవి గ్రామస్థ‌లకు అందించేందుకు సిద్ద‌మ‌య్యారు. ఒక‌టా రెండా సోనూసూద్ చేసిన సేవ‌ల‌కు పులిస్టాప్ అనేదే లేదు. ఆయ‌న చేస్తున్న సేవ‌ల‌కు సామాన్యుల‌తో పాటు సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. కొంద‌రు ఏదో ఆశించి చేస్తున్నాడ‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నా కూడా అవేమి ప‌ట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు సోనూసూద్.

క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో ఆక్సిజ‌న్ కొర‌త చాలా ఏర్ప‌డింది. దీంతో చాలా మంది ఆక్సిజ‌న్ అందించేందుకు ముందుకు వ‌స్తున్నారు. చిరంజీవి కూడా ఆక్సిజ‌న్ బ్యాంక్‌ని ప‌లు జిల్లాల‌లో ఏర్పాటు చేసి అవ‌స‌ర‌మైన వారికి అందిస్తున్నారు. అయితే తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఆప‌ద‌లో ఉన్న‌వారికి వెంట‌నే సాయం అందిస్తున్నారు. రీసెంట్‌గా నంద కిషోర్ అనే వ్య‌క్తికి ఆక్సిజ‌న్ కాన్స‌న్‌ట్రేట‌ర్ పంప‌డంతో ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ద్వారా కేటీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. కేటీఆర్ గారు మీకు థ్యాంక్స్ అని చెప్ప‌డం చాలా చిన్న‌ది. మేం అడిగిన ప‌ది గంట‌ల‌లో ఆక్సిజ‌న్ కాన్స‌న్‌ట్రేట‌ర్‌ని పంపించారు. తెలంగాణ ప్ర‌జ‌ల కోసం మీరు చేస్తున్న సేవ‌లు అనిర్వ‌చ‌నీయం. ఈ రోజు చెబుతున్నాను మీరు నిజ‌మైన సూప‌ర్ హీరో అని కామెంట్ పెట్టారు. దీనికి స్పందించిన కేటీఆర్ .. నేను ప్ర‌జా ప్ర‌తినిథిని కాబ‌ట్టి నా ప‌ని నేను చేసుకుంటూ వెళుతున్నాను.సోనూసూద్ అస‌లైన సూప‌ర్ హీరో. ఆప‌ద‌లో ఉన్నవారికి మీరు కూడా మీకు తోచినంత సాయం చేయండ‌ని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.