Krithi Shetty: బాలీవుడ్‌కి బేబ‌మ్మ‌.. వ‌రుస ఆఫ‌ర్స్‌తో స్టార్ హీరోయిన్స్‌కి షాక్ ఇస్తున్న మంగ‌ళూరు భామ‌

Krithi Shetty: జ్వరం కావాలా నీకు అంటూ ఉప్పెన సినిమాలో తన అందం, అభినయంతో తెలుగు రాష్ట్రాల్లోని కుర్రాళ్ళందరికీ మూకుమ్మడిగా జ్వరం తెప్పించింది కృతి శెట్టి. నిండా 20 కూడా లేని ఈ భామ.. తన అందంతో అందరికీ పిచ్చెక్కించింది. ఉప్పెన తర్వాత టాలీవుడ్ దర్శక నిర్మాతలు కృతి జపమే చేస్తున్నారు. అయినా ఈ రోజుల్లో హీరోయిన్లకు క్రేజ్ రావడానికి ఎంతో టైమ్ పట్టదు. ఒక్కోసారి ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే స్టార్స్ అయిపోతుంటారు.

Krithi Shetty

ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి దీనికి నిదర్శనం. తొలి సినిమా విడుదలకు ముందే కృతికి వెల్లువలా అవకాశాలు వచ్చాయి. ఉప్పెన విడుదలయ్యాక టైటిల్ కు తగ్గట్లే ఉప్పెనలా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈమె వయసు 17 ఏళ్లు మాత్రమే. ఇంకా ఇంటర్మీడియట్ చదువుతుంది కృతి. అంతలోనే హీరోయిన్ అయిపోయింది.. తొలి సినిమా విడుదలకు ముందు నుంచే తెలుగులో సత్తా చూపిస్తుంది.

ఉప్పెన సినిమా విడుదలకు ముందే సుధీర్ బాబు, ఇంద్రగంటి కాంబినేషన్ లో వస్తున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలో హీరోయిన్ గా ఖరారు అయింది కృతి. దాంతో పాటు నాని హీరోగా వస్తున్న శ్యామ్ సింగ రాయ్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది కృతి. రామ్ పోతినేని, లింగుసామి కాంబినేషన్ లో వస్తున్న బై లింగువల్ సినిమాలోనూ కృతి హీరోయిన్ గా కన్ఫర్మ్ అయింది.

మరోవైపు తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా ఈమెకు అవకాశాలు వస్తున్నాయి. ఇకపై సైన్ చేయబోయే సినిమాలకు 70 లక్షలు కూడా కాదు కోటి రూపాయలు కావాలని అడుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం అంతకంటే సంచలనం మరోటి ఉండదు. మొన్న చిరంజీవి కూడా ఈ భామను బుక్ చేసుకోండి.. తర్వాత దొరకదు అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో కృతికి మరింత క్రేజ్ పెరిగిపోయింది..

Krithi Shetty

ఉప్పెన‌ను హిందీలో రీమేక్ చేసేందుకు బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నట్టు బీటౌన్ లో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒక‌టి చ‌క్క‌ర్లు కొడుతోంది. ఒక వేళ రీమేక్ తెర‌రూపం దాలిస్తే హిందీ ప్రాజెక్టులో కూడా బేబ‌మ్మ పాత్ర‌లో కృతిశెట్టినే తీసుకుంటార‌ని ఊహాగానాలు వ‌స్తున్నాయి.

ఏదేమైనా ఒక్క సినిమా విడుదల కాగానే అంత పారితోషికం డిమాండ్ చేస్తే అమ్మడు బ్యాగ్ సర్దేసుకోవచ్చు అంటున్నారు విశ్లేషకులు. అయితే కృతి శెట్టి పీఆర్ టీం మాత్రం అలాంటివేం లేవని కొట్టి పారేస్తుంది. రెమ్యునరేషన్ గురించి అసలు టాపిక్ రాలేదని.. అవన్నీ ఒట్టి అబద్ధాలే అంటూ తీసి పారేస్తున్నారు. పారితోషికం నిజమా అబద్ధమా అని పక్కనబెడితే తొలి సినిమాకే ఇంత క్రేజ్ తెచ్చుకోవడం మాత్రం నిజంగానే అద్భుతం.