Kamal Haasan: కొత్త బిజినెస్ మొద‌లు పెట్ట‌బోతున్న‌ క‌మ‌ల్ హాస‌న్..ఎక్క‌డో తెలుసా?

Kamal Haasan: లోకనాయ‌కుడు క‌మ‌ల్ హాసన్ ట్రెండ్‌కి త‌గ్గ‌ట్టుగా ముందుకు సాగుతున్నారు. సినిమానే ప్ర‌పంచంగా బ‌తికిన వ్య‌క్తి నటుడిగా, నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా, టెక్నీషియ‌న్‌గా ఇలా అన్నింటా తానై క‌నిపించే ప్ర‌య‌త్నం చేశాడు. త‌న విల‌క్ష‌ణ న‌ట‌న‌తో క‌మ‌ల్ హాస‌న్‌ సినిమాకు జీవం పోసే ప్ర‌య‌త్నం చేస్తార‌న‌డంలో సందేహం లేదు.

Kamal Haasan

ఇప్పుడు క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌లో క‌నిపిస్తున్నారు. అలాగే సినిమాలే లోకం కాద‌ని, మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా త‌న‌ను తాను మార్చుకుని రియాలిటీ షో బిగ్‌బాస్ త‌మిళ వెర్ష‌న్‌ను ఆయ‌న ఐదు సీజ‌న్స్‌గా హోస్ట్ చేస్తూ వ‌స్తున్నారు. క‌మల్‌లో వ‌చ్చిన మార్పు చూసి ఆయ‌న స‌న్నిహితులు కూడా కాస్త ఆశ్చ‌ర్య‌పోయారు. మ‌రోవైపు రాజ‌కీయాల‌లోను స‌త్తా చాటుతున్నారు.

కమల్ ఇప్పుడు ఫ్యాషన్ వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్నారు. కమల్ తన ఫ్యాషన్ లేబుల్ `హౌస్ ఆఫ్ ఖద్దర్` ను నవంబర్ లో ప్రారంభించనున్నారు. అమెరికా- చికాగోలో హౌస్ ఆఫ్ ఖద్దర్ మొదటి స్టోర్ ను ప్రారంభించడం ద్వారా భారతీయ చేనేత ప్రాశస్త్యాన్ని విదేశాలకు విస్తరిస్తున్నారు.

చేనేత దుస్తులు సహా ఉపకరణాలకు గ్లోబల్ ప్లాట్ ఫారమ్ ఇవ్వాలని కమల్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అమృత రామ్ ఈ దుస్తులను రూపొందించారు. ఎందుకు ఇలా ప‌లు రంగాల్లో అడుగు పెడుతున్నార‌నే డిస్క‌ష‌న్ లేక‌పోలేదు. అయితే ఒక‌వైపు త‌న అవ‌స‌రాల‌తో పాటు ఆయ‌న ప్రారంభించిన మ‌క్క‌ల్ నీది మయ్యం అనే రాజ‌కీయ పార్టీని న‌డింపించ‌డం కోసం డ‌బ్బులు అవ‌స‌రం.

దాన్ని ముందుకు తీసుకెళ్ల‌డం కోసం సినిమాల‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌, బిగ్‌బాస్ వంటి ప్రోగ్రామ్స్ చేయ‌డం ద్వారా ముందుకెళ్లొచ్చు అనేది ఈ వెర్స‌టైల్ యాక్ట‌ర్ ఆలోచ‌న అని ఆయ‌న అభిమానులు అంటున్నారు. క‌మ‌ల్ హాస‌న్ ఇప్పుడు లోకేశ్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో విక్ర‌మ్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో క‌మ‌ల్ హాస‌న్ న‌టించ‌డంతో పాటు, స‌ద‌రు సినిమాను నిర్మిస్తున్నారు.