చిరంజీవి అల్లుడికి సోకిన క‌రోనా .. త్వ‌ర‌లోనే శ‌క్తివంతంగా వ‌స్తానంటూ ట్వీట్

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు చిరంజీవి చిన్న‌ల్లుడు, శ్రీజ భ‌ర్త క‌ళ్యాణ్ దేవ్. విజేత సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేసిన క‌ళ్యాణ్ దేవ్ త్వ‌ర‌లోనే సూప‌ర్ మ‌చ్చి చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఇక యంగ్ డైరెక్ట‌ర్ ర‌మ‌ణ తేజ(అశ్వ‌ధామ ఫేమ్) దర్శకత్వంలో ప్ర‌ముఖ నిర్మాత రామ్ త‌ళ్లూరి నిర్మాణ సార‌థ్యంలో ఎస్. ఆర్. టి ఎంటర్ టైన్మెంట్స్ పై కిన్నెర సాని చిత్రం చేస్తున్నాడు. క‌రోనా వ‌ల‌న ఈ చిత్ర షూటింగ్ వాయిదా ప‌డిన‌ట్టు తెలుస్తుంది.

క‌ళ్యాణ్ దేవ్‌కు తాజాగా క‌రోనా సోకిన‌ట్టు నిర్దార‌ణ అయింది. గ‌త రాత్రి ప‌రీక్ష‌లు చేయించుకోగా, పాజిటివ్ వ‌చ్చింద‌ని ఆయ‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశాడు. ప్ర‌స్తుతం హాస్పిట‌ల్‌లోనే క్వారంటైన్‌లో ఉన్న‌ట్టు పేర్కొన్న క‌ళ్యాణ్ దేవ్ త్వ‌ర‌లోనే శ‌క్తివంతంగా, ఆరోగ్యంగా వ‌స్తాన‌ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పేర్కొన్నారు. క‌ళ్యాణ్ దేవ్‌కు క‌రోనా అని తేల‌డంతో ఆయ‌న ఫ్యామిలీ మొత్తం క్వారంటైన్ లోకి వెళ్లింది. క‌ళ్యాణ్ దేవ్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆయ‌న అభిమానులు, కుటుంబ స‌బ్యులు ప్రార్ధిస్తున్నారు. కాగా, మెగా ఫ్యామిలీలో నాగ‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వ‌రుణ్ తేజ్, రామ్ చ‌ర‌ణ్ క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే.

Advertisement