Kajal Aggarwal : పెళ్ళయ్యాక సినిమాల్లో నటించా.. తల్లయ్యాక కూడా సినిమాల్లో నటిస్తా.. వచ్చేస్తున్నా, మళ్ళీ వచ్చేస్తున్నా.. అంటోంది అందాల చందమామ కాజల్ అగర్వాల్. కోవిడ్ సమయంలో పెళ్ళి పీటలెక్కిన కాజల్ అగర్వాల్, అప్పట్లో ‘ఆచార్య’ సినిమాలో నటించిందిగానీ, ఆ సినిమాలో ఆమె పాత్రను ఆ తర్వాత కట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ విషయమై ఇప్పటికీ రాద్ధాంతం కొనసాగుతూనే వుంది. అయితే, ఇంతవరకు కాజల్ అగర్వాల్ ‘ఆచార్య’లో తన పాత్ర తొలగింపుపై స్పందించలేదు. సినిమాలో నటించకపోయినా, రెమ్యునరేషన్ మాత్రం ఆమె బాగానే అందుకుందట.
‘ఇండియన్-2’ కోసం వచ్చేస్తున్నా..

ప్రముఖ దర్శకుడు శంకర్, విశ్వనటుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో ‘భారతీయుడు-2’ (ఇండియన్-2) సినిమా గతంలోనే ప్రారంభమయ్యింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలకుగాను ఎంపికయ్యారు. కొంతమేర షూటింగ్ కూడా జరిగింది.
అనివార్య కారణాల వల్ల ‘ఇండియన్-2’ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోగా, అది మళ్ళీ సెప్టెంబర్‌లో పునఃప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ‘సెప్టెంబర్ నుంచి మళ్ళీ భారతీయుడు 2 సినిమా షూటింగ్‌లో పాల్గొంటాను’ అంటూ తాజాగా కాజల్ వ్యాఖ్యానించడం గమనార్హం.
కాజల్ ప్లేస్‌లో దీపికా పడుకొనే, కత్రినా కైఫ్ పేర్లను పరిశీలిస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్న వేళ, తాను ఆ ప్రాజెక్టులో వున్నానంటూ కాజల్ క్లారిటీ ఇవ్వడంతో ‘చందమామ’ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.