Sirivennela : అప్పుడు కుడిభుజం , ఇప్పుడు ఎడ‌మ భుజం కోల్పోయా.. విశ్వ‌నాథ్ ఎమోష‌న‌ల్ కామెంట్స్

Sirivennela : సినీ వినీలాకాశంనుంచి ఓ దృవతార నేలరాలింది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి కన్నుమూతతో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. అనారోగ్యంతో సిరివెన్నల కనుమూశారు. సినిమా ప్రేమికులంతా సాహిత్య లోకానికి చీకటి రోజుగా అభివర్ణిస్తున్నారు.

K Viswanath EMOTIONAL Words about Sirivennela Seetharama Sastry
K Viswanath EMOTIONAL Words about Sirivennela Seetharama Sastry

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. దాదాపు మూడున్న‌ర ద‌శాబ్దాల ప్ర‌యాణంలో ఆయ‌న క‌లం ఎప్పుడూ అలుపెర‌గ‌లేదు. అయితే సిరివెన్నెల సీతారామ శాస్త్రితో కళాతపస్వి కె. విశ్వనాథ్ బంధం ఎంతో ప్రత్యేకమైంది.

సీతారామ శాస్త్రిని టాలీవుడ్ లోకానికి పరిచయం చేసింది డైరెక్టర్ కె. విశ్వనాథ్. తన పెన్ ప‌వ‌ర్ ఏంటో తెలుగు సినీ పరిశ్ర‌మ‌కు రుచి చూపించిన ఆయన ‘సిరివెన్నెల’ సినిమాలో అన్ని పాటలు రాసి అదే పేరును ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఆయన అసలు పేరు చేంబోలు సీతారామ శాస్త్రి కాగా సిరివెన్నెల సాంగ్స్ రాశాక సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా మారిపోయింది.

సిరివెన్నెల లేరనే వార్త తెలిసి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు విశ్వ‌నాథ్‌. ”ఇది నమ్మలేని నిజం. చాల పెద్ద లాస్ నాకు. బాలసుబ్రమణ్యం పోయినపుడు కుడి భుజం పోతే సిరివెన్నెల మరణంతో ఎడమ భుజం పోయింది. ఏం చేయాలో, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. ఎంతో సన్నిహితంగా ఉండే ఆయన ఒక్కసారే అంతర్దానం కావడం నమ్మశక్యంగా లేదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.

ఇది చెప్పలేని ఒక సిచుయేషన్.. నేను ఇంతకన్నా ఏం మాట్లాడలేక పోతున్నా” అని అన్నారు కె. విశ్వనాథ్. ఎన్నో ఏండ్లుగా వారిద్ద‌రి మ‌ధ్య అనుబంధం పెన‌వేసుకునిపోయింది. అలాంటి ఆప్త‌మిత్రుడు దూరం కావ‌డంతో కె.విశ్వ‌నాథ్ ఎంత‌గానో త‌ల్ల‌డిల్లిపోయారు. త‌న ఆవేద‌న‌ను ఒక వీడియో రూపంలో రిలీజ్ చేసి ఉద్వేగానికి లోన‌య్యారు.

విశాఖ జిల్లా అనకాపల్లిలో 1955 మే 20న డాక్టర్ సి.వి.యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించిన సీతారామ శాస్త్రి.. కాకినాడలో ఇంటర్మీడియెట్‌ వరకు చదివి ఆంధ్ర విశ్వ కళా పరిషత్తులో బిఏ పూర్తి చేశారు. ఆ తర్వాత కొంతకాలంపాటు టెలిఫోన్స్‌ శాఖలో పని చేశారు. కె. విశ్వనాథ్ అవకాశం కల్పించడంతో సిరివెన్నెల సినిమాలో పాటలన్నీ రాశారు.