Joe Root : ఇండియా-ఇంగ్లండ్ మొదటి టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఫస్టు బ్యాటింగ్ చేస్తున్న జో రూట్ టీమ్ ఇప్పటికి ఎనిమిది వికెట్లు కోల్పోయి మొత్తం 555 పరుగులు చేసింది. మ్యాచ్ రెండో రోజు (శనివారం) పూర్తయినా తొలి ఇన్నింగ్స్ ని ఇంకా డిక్లేర్ చేయకపోవటం ఏంటనేది ఎవరికీ అంతచిక్కట్లేదు. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ తన రూటే సెపరేట్ అనిపించుకుంటున్నాడు. తాను నిన్న చేసిన సెంచరీని ఇవాళ ఏకంగా సిక్సర్ తో డబుల్ సెంచరీగా మలచటం విశేషం.
రికార్డులే రికార్డులు..
జో రూట్ ఒక్కడే మొత్తమ్మీద 218 రన్నులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో తన పేరిట ఎన్నో రికార్డులను నమోదు చేసుకున్నాడు. అతని కెరీర్ లో ఇది ఐదో డబుల్ సెంచరీ కాగా చివరి మూడు టెస్టుల్లో రెండోది కావటం గమనార్హం. సిక్సర్ తో ద్విశతకం చేసిన తొలి ఇంగ్లండ్ క్రికెటర్ గా జో రూట్ ఘనత సాధించాడు. వందో టెస్టులో హయ్యస్ట్ స్కోర్(184 రన్నులు) చేసిన రికార్డు ఇప్పటివరకు పాకిస్థాన్ ప్లేయర్ ఇంజమామ్ ఉల్ హక్ పేరిట ఉండేది. దాన్ని జో రూట్ బద్ధలు కొట్టి 218 పరుగులతో తన పేరిట రాయించుకున్నాడు.
ఆసియాలో: Joe Root
ఆసియా ఖండంలో వరుసగా మూడు సెంచరీలు చేసిన క్రికెటర్ గా కూడా జో రూట్ స్పెషల్ ఫీట్ సొంతం చేసుకున్నాడు. జో రూట్ తన తొలి టెస్టును(2011లో నాగ్ పూర్ లో), 50వ టెస్టును(2016లో విశాఖపట్నంలో), 100వ టెస్టును(2021లో చెన్నైలో) ఇండియాలోనే ఇండియాపైనే ఆడటం అరుదైన విషయం. జో రూట్ జోరు గురించి ఇలా ఎంత చెప్పుకున్నా తరిగేట్లు లేదు. సిక్సర్ తో డబుల్ సెంచరీ చేయటం అనే విషయంలో మన సెహ్వాగ్ ని తలపించాడు. టీమిండియా బౌలర్లలో ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, నదీమ్.. నలుగురూ తలో రెండు వికెట్ల చొప్పున తీశారు.

డ్రాయే?..
మొదటి టెస్టులో ఇంకా మూడు రోజులే మిగిలి ఉంది. రేపు మూడో రోజు ఇంగ్లండ్ ఆలౌట్ అయ్యే వరకు ఆడుతుందేమో అనిపిస్తోంది. అంటే కనీసం ఇరవై ముప్పై పరుగులైనా చేస్తుంది. తద్వారా సుమారు 600 రన్నులు సాధిస్తుంది. ఆ టార్గెట్ ని చేరుకోవటానికి మనోళ్లకు కూడా కనీసం రెండు రోజులు పడుతుంది. దీంతో మొత్తం నాలుగు రోజులు అయిపోతాయి. ఇక ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంటుంది. ఆ ఒక్క రోజులో ఆట ఫలితం తేలటం అసాధ్యం. కాబట్టి డ్రా అయ్యే ఛాన్స్ లే ఎక్కువ ఉన్నాయి.