Jati Ratnalu : కొన్ని సినిమాలు పేరు దగ్గర నుంచి పూర్తయ్యే వరకు నవ్విస్తూనే ఉంటాయి. సింపుల్ గా తెర మీదికి వచ్చి వసూళ్ల సునామీ రేపుతాయి. అంచనాల్లేకుండా విడుదలై అనూహ్యంగా హిట్ అవుతాయి. కామెడీ త్రిమూర్తులు కలిసి నటించిన ‘‘జాతిరత్నాలు’’ సినిమాయే దీనికి నిఖార్సైన ఉదాహరణ. అసలు ఆ టైటిల్ వింటేనే హాస్యం తన్నుకొస్తోంది. మూవీలో అడుగడుగునా జోకులే జోకులు. అవి ఈ నెల పదకొండో తారీఖు నుంచి ప్రతి ఇంట్లోనూ వినిపించనున్నాయి. ఎందుకంటే ఈ పిక్చర్ వచ్చే ఆదివారం ఆన్ లైన్ లోకి వచ్చేసోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ మరో మూడు రోజుల్లో దీన్ని ప్రేక్షకుల ముందుకు, ప్రతి గడపకూ, ప్రతి స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పైకి తెస్తోంది.
నెల రోజులైనా..
ఈ రోజుల్లో చాలా తెలుగు చలన చిత్రాలు అలా రిలీజై ఇలా తోక ముడుస్తున్నాయి. ఎప్పుడు థియేటర్లలోకి వస్తున్నాయో ఎప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోతున్నాయో ఎవరికీ తెలియని పరిస్థితి. ఇలాంటి తరుణంలో నెల రోజుల కిందట శివరాత్రి పర్వదినం(మార్చి 11) సందర్భంగా సినిమా హాళ్లలోకి ఎంటరైన ‘‘జాతిరత్నాలు’’ నాన్ స్టాప్ గా నవ్వులు పూయిస్తూనే ఉన్నారు. కడుపుబ్బ కామెడీని నింపుతున్నారు. దీని తర్వాత ఎన్ని మూవీలు వచ్చి సైలెంటుగా చెక్కేశాయో. ఇది మాత్రం నాటౌట్ గా నిలిచింది.

సరైన సమయంలో: Jati Ratnalu
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కాబట్టి జనం సినీ మహల్స్ కి రావటానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘‘జాతిరత్నాలు’’ని ఇంటింటికీ చేరవేయాలని దర్శకనిర్మాతలు తీర్మానించుకున్నారు. ఇవాళ బుధవారం ఎలాగూ అయిపోయింది. ఇక.. గురు, శుక్ర, శనివారాలు ఓపిక పడితే చాలు. సండేని ఫండేగా మార్చటానికి ‘‘జాతిరత్నాలు’’ రెడీగా ఉన్నారు. దీంతో ప్రతి ఇల్లూ పకపకలతో హౌజ్ ఫుల్లు కావటం ఖాయం. అనుదీప్ డైరెక్షన్ చేసిన ఈ చిత్రంలో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, క్యారక్టర్ ఆర్టిస్టులు మురళీవర్మ, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, నరేష్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, కమెడియన్ వెన్నెల కిషోర్ తదితరులు నటించిన విషయం తెలిసిందే.