Japan Movie Review : ‘జపాన్’ సినిమా రివ్యూ

NQ Staff - November 10, 2023 / 12:51 PM IST

Japan Movie Review : ‘జపాన్’ సినిమా రివ్యూ

తారాగణం:  కార్తీ, అనూ ఇమాన్యుయేల్, సునీల్, విజయ్ మిల్టన్, కె.ఎస్. రవికుమార్, జితన్ రమేశ్, వాగై చంద్రశేఖర్,
డైలాగ్స్:  రాకేందు మౌళి వెన్నెలకంటి
పాటలు:  భాస్కరభట్ల రవికుమార్
మ్యూజిక్:  జి.వి. ప్రకాశ్ కుమార్
సినిమాటోగ్రఫీ:  యస్. రవివర్మన్
ఎడిటింగ్:  ఫిలోమిన్ రాజ్
స్టంట్స్:  అణల్ అరసు
నిర్మాతలు:  యస్.ఆర్. ప్రకాశ్ బాబు, యస్.ఆర్. ప్రభు
దర్శకత్వం:  రాజు మురుగన్
బ్యానర్:  డ్రీమ్ వారియర్ పిక్చర్స్
విడుదల తేదీ:  10 నవంబర్ 2023

తెలుగునాట మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ ‘జపాన్‌’కు సంబంధించి కొన్ని రోజులుగా ప్రమోషన్స్ జోరుగా నడుస్తూ వచ్చాయి. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రముఖ ప్రొడక్షన్ హౌసెస్‌లో ఒకటైన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ మూవీలో తెలుగమ్మాయి అను ఇమాన్యుయేల్ హీరోయిన్. ఇవాళ నవంబర్ 10న మన ముందుకు వచ్చిన ఈ మూవీకి రాజు మురుగన్ దర్శకుడు.

కథాంశం : 

హైదరాబాద్‌లోని రాయల్ జ్యూయెలర్స్‌లో ఒక రాత్రి మొత్తం ఆభరణాలు చోరీకి గురవుతాయి. అది హోం మినిస్టర్‌కు సంబంధించింది. ఆ దొంగతనం జపాన్ చేశాడని పోలీసులు నమ్మి, అతని కోసం వేట మొదలుపెడతారు. వారి నుంచి జపాన్ ఎలా తప్పించుకు తిరిగాడు, నిజంగా ఆ దొంగతనం అతనే చేశాడా? ఆ చోరీ వల్ల పోలీసులకు, హోం మినిస్టర్‌కు ఎలాంటి తిప్పలు వచ్చాయి? జపాన్ జీవితం చివరకు ఏమయ్యిందనేది మిగతా కథ.

విశ్లేషణ : 

ఒక నగల దుకాణం చోరీ చుట్టూ అల్లుకున్న ఈ క్రైం స్టోరీకి హ్యూమర్‌ను మేళవించి ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చెయ్యాలని డైరెక్టర్ రాజు మురుగన్ ట్రై చేశాడు. చోరీకి సంబంధించి సెకండాఫ్‌లో వచ్చే ట్విస్ట్ మరీ ఊహించనిది కాకపోయినా ఆసక్తిని రేకెత్తిస్తుంది. జపాన్ క్యారెక్టరైజేషన్‌ను ఎంటర్‌టైనింగ్‌గా డైరెక్టర్ తీర్చిదిద్దిన విధానం బాగానే ఉన్నప్పటికీ, ఎమోషనల్ కనెక్టివిటీ మిస్సవడం సినిమాకు మైనస్ అయ్యిందని చెప్పాలి. జపాన్ ప్రియురాలు, సినిమా తారగా కనిపించే అను ఇమాన్యుయేల్‌తో రొమాంటిక్ యాంగిల్ సరిగా వర్కవుట్ కాలేదు. జపాన్ జర్నీలో అతని ప్రధాన అనుచరుడు ఓబులేశు (వాగై చంద్రశేఖర్)తో సీన్లు బాగా వచ్చాయి. జపాన్‌ను ఎలాగైనా పట్టుకోవాలని పోలీసుల్లోనే రెండు గ్రూపులు – ఒకటి సునీల్ గ్రూపు, ఇంకొకటి విజయ్ మిల్టన్ గ్రూప్ తీవ్రంగా ప్రయత్నించడం, ఆ రెండు గ్రూపుల నుంచి జపాన్ తప్పించుకొనే తీరును దర్శకుడు ఆసక్తికరంగా చిత్రీకరించాడు.

Japan Movie Review

Japan Movie Review

అసలు దొంగను పట్టుకోలేకపోతే, ఎవడో ఒక అమాయకుడ్ని పట్టుకొని అతడే దొంగతనం చేసినట్లు ఒప్పుకొనేలా చిత్రహింసలు పెట్టే పోలీసుల తీరును కూడా ఈ సినిమాలో దర్శకుడు చూపించాడు. సినిమా అంతా ఒకెత్తు, చివరి 30 నిమిషాలు ఒకెత్తు అనేలా రాజు మురుగన్ సినిమాని తీశాడు. అప్పటి దాకా మిస్సయిన ఎమోషన్ క్లైమాక్స్ సీన్‌లో కనిపిస్తుంది. అమ్మ అనే ఎమోషన్‌తో ప్రేక్షకుల్ని భావోద్వేగానికి గురిచెయ్యాలనేది దర్శకుడి ఆలోచన అయినా, ఆ ఎమోషన్ మధ్యమధ్యలో కూడా ఉన్నట్లయితే, మనం మరింతగా జపాన్ పాత్రతో కనెక్ట్ అయ్యేవాళ్లం. అది మిస్సవడమే ఈ సినిమాకి నష్టం చేకూర్చింది.

టెక్నికల్‌గా సినిమా బాగుంది. రాకేందుమౌళి రాసిన డైలాగ్స్ చాలాచోట్ల నవ్వించాయి, మెప్పించాయి. జీవీ ప్రకాశ్‌కుమార్ బ్యాగ్రౌండ్ స్కోర్ యాప్ట్‌గా ఉంది. పాటలు ఓ మోస్తరుగా ఉన్నాయి. రవివర్మన్ సినిమాటోగ్రఫీ మూవీకి ఒక ఎస్సెట్. సన్నివేశాల్లోని మూడ్‌ని కెమెరా బాగా పట్టుకుంది. కలర్ టోన్ దానికి తగ్గట్లే ఉంది. చివరిలో కనిపించిన ఎమోషన్ మిడిల్‌లో కూడా కనిపించాల్సిన విషయాన్ని ఎడిటర్ ఫిలోమిన్ రాజ్ గుర్తించలేకపోయాడు. అణల్ అరసు స్టంట్స్ యాక్షన్ ప్రియులను అలరిస్తాయి. ముంజలను బాంబులుగా వాడిన తీరు వినోదాన్ని పంచింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ : 

టైటిల్ రోల్‌లో కార్తీ నటన, అతని డైలాగ్ డిక్షన్
డైలాగ్స్‌లోని హ్యూమర్
మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, స్టంట్స్

మైనస్ పాయింట్స్ : 

ఎమోషన్ లేని క్రైం డ్రామా
బలహీనమైన స్క్రీన్‌ప్లే
ఆకట్టుకోని హీరో హీరోయిన్ల రొమాన్స్

Japan Movie Review

Japan Movie Review

నటీనటుల పనితీరు : 

జపాన్ క్యారెక్టర్‌లో కార్తీ విజృంభించి నటించాడు. హ్యూమర్‌ను అతను బాగా పండించగలడని ఈ సినిమా మరోసారి నిరూపిస్తుంది. అతని డైలాగ్ డెలివరీ వినోదాన్ని అందిస్తుంది. అను ఇమాన్యుయేల్ కనిపించేది కొద్దిసేపే అయినా సినిమాకి గ్లామర్‌ను అద్దింది. సగం గుండుతో పోలీసాఫీసర్ శ్రీధర్‌గా సునీల్, మరో పోలీసాఫీసర్‌గా విజయ్ మిల్టన్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. జపాన్ ప్రధాన అనుచరుడు ఓబులేశుగా సీనియర్ యాక్టర్ వాగై చంద్రశేఖర్ ఆకట్టుకున్నారు. ఒకప్పుడు తెలుగులో హీరోగా నటించిన ప్రొడ్యూసర్ ఆర్బీ చౌదరి గారబ్బాయి జితన్ రమేశ్ ఈ మూవీలో గంగాధర్ అనే నెగటివ్ క్యారెక్టర్‌లో కనిపించి ఆశ్చర్యపరిచాడు. హోం మినిస్టర్‌గా కె.ఎస్. రవికుమార్‌కు నటించడానికి ఎక్కువ అవకాశం లభించలేదు.

న్యూస్‌క్యూబ్ వర్డిక్ట్ :

కొన్నిచోట్ల నవ్వించే ‘జపాన్’, అవసరమైన చోట భావోద్వేగాన్ని రేకెత్తించే విషయాన్ని మర్చిపోవడం వల్ల, ఆడియెన్స్ హృదయాల్ని గెలుచుకొనే అవకాశాల్ని చాలావరకు కోల్పోయాడు.

                                                       రేటింగ్: 2/5

                                                  – బుద్ధి యజ్ఞమూర్తి

Read Today's Latest సినిమా రివ్యూలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us