IT Raids on Sonusood: సోనూసూద్‌పై ఐటీ దాడులు.. ఆరు చోట్ల జ‌రిగిన తనిఖీలు

IT Raids on Sonusood: ప్ర‌ముఖ న‌టుడు సోనూసూద్ ఇప్పుడు ప్ర‌జ‌ల గుండెల్లో దేవుడిగా కీర్తించ‌బ‌డుతున్నాడు. ఆయ‌న చేతికి ఎముక లేద‌న్న‌ట్టు సాయాలు చేసుకుంటూ పోతూనే ఉన్నాడు. లాక్ డౌన్ మొద‌లైన‌ప్ప‌టి నుండి సాయాలు చేసుకుంటూ వెళుతున్న సోనూసూద్ ఇప్ప‌టికీ దానిని కొన‌సాగిస్తూనే ఉన్నాడు.

IT Raids on Sonusood Properties
IT Raids on Sonusood Properties

అయితే సినీ నటుడు సోనూసూద్‌పై ఐటీ శాఖ ‘సర్వే’ చేసింది. ఆయనకు సంబంధించిన ఆరు నివాసాల్లో తనిఖీలు చేసినట్టు స‌మాచారం. ముంబైలోని ఆయనకు చెందిన ఆఫీసులో కూడా తనిఖీలు చేసినట్టు సమాచారం. ముంబైలోని ఆరు ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పాఠశాల విద్యార్థుల మెంటార్ షిప్ ప్రోగ్రాంకు ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ సర్కారు సోనూసూద్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది.

అంతకు ముందు పంజాబ్ ప్రభుత్వంలో కూడా కరోనా వైరస్ మీద అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ రెండు ప్రభుత్వాలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నవే. ఇలాంటి సమయంలో సోనూ సూద్‌కు సంబంధించిన ఆరు నివాసాల్లో ఐటీ అధికారులు ‘సర్వే’ చేశారనే వార్త సంచలనంగా మారింది.

లాక్ డౌన్‌లో ప్రభుత్వాలు కూడా చేయని పని సోనూ చేశాడు. వందల బస్సులు ఏర్పాటు చేసి కూలీలను వారి ఇళ్లకు చేర్చాడు. దీంతో దేశం మొత్తం సోనూని రియల్ హీరోగా కొనియాడింది. సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేశాడు. గొప్ప మానవతావాదిగా గుర్తింపు పొందాడు. సాయం పొందిన వాళ్లు సోనూని దేవుడిలా చూస్తున్నారు.

ఆయన రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ పుకార్లు వచ్చాయి. అంతకు ముందు ఏకంగా ముంబై మేయర్‌గా కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దింపుతున్నారంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే, వాటన్నిటిపై స్పందించేందుకు సోనూసూద్ నిరాకరించాడు.