IPL : ముందు బ్యాటింగ్.. ఎందుకు భయం..

Kondala Rao - April 17, 2021 / 04:44 PM IST

IPL : ముందు బ్యాటింగ్.. ఎందుకు భయం..

IPL ఆటన్నాక గెలుపోటములు సహజం. అయితే క్రికెట్ లాంటి ఆటల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. క్షణక్షణం గేమ్ మారిపోతుంది. ఎందుకంటే ఒక్క బంతికే, ఒక్క షాట్ కే మ్యాచ్ రిజల్ట్ మొత్తం రివర్స్ అవుతుంది. విజయం ముంగిట పరాజయం పాలవొచ్చు. పరాజయం అంచులో ఉండి అనూహ్యంగా విజయాన్ని అందుకోవచ్చు. అలాగే మ్యాచ్ ఫలితాన్ని టాస్ కూడా నిర్దేశించదు. టాస్ ఓడినా మ్యాచ్ నెగ్గొచ్చు. టాస్ నెగ్గినా మ్యాచ్ చేజారిపోవచ్చు. మ్యాచ్ ని సొంతం చేసుకుంటామా కోల్పోతామా అనే అంశాన్ని పిచ్ మాత్రం తప్పకుండా ప్రభావితం చేస్తుంది. ముందు బ్యాటింగ్ కి సహకరించని పిచ్ తర్వాత అనుకూలించొచ్చు. ముందు బౌలింగ్ కి అనుకూలించిన పిచ్ తర్వాత తేలిపోవచ్చు. అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన టాపిక్ ఏంటంటే ‘‘టాస్’’. ఎందుకంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ లో ఇప్పటివరకు జరిగిన ఎనిమిది మ్యాచ్ ల్లో ఎనిమిది సార్లూ టాస్ గెలిచిన జట్టే ముందుగా బౌలింగే (ఫీల్డింగే) ఎంచుకుంది.

ఎందుకిలా చేశారు?..

ప్రత్యర్థి జట్టు తొలుత బ్యాటింగ్ చేస్తే మనకి ఎంత టార్గెట్ పెడుతుందో ముందే తెలుస్తుంది. ఆ లక్ష్యాన్ని అందుకోవటానికి జాగ్రత్తగా ఆడితే సరిపోతుంది. తక్కువ టార్గెట్ అయితే నిదానంగా, పెద్ద లక్ష్యమైతే ధాటిగా ఆడాలి. అలా కాకుండా మనమే ముందుగా బ్యాటింగ్ చేస్తే ఎంత టార్గెట్ పెట్టాలనే దానిపై మనకు ఒక క్లారిటీ ఉండదు. 20 ఓవర్లలో 200లకు పైగా భారీ స్కోర్ చేసినా అపొజిషన్ టీమ్ ఒక్కోసారి దాన్ని అవలీలగా ఛేదించే అవకాశం ఉంది. అలా అని చెప్పి ఓటమి నుంచి తప్పించుకోవటానికి ఇంకా భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి జట్టు ముందు ఉంచాలని ట్రై చేస్తే, వేగంగా ఆడితే, ఫోర్లు-సిక్సులే కొడితే త్వరత్వరగా వికెట్లు కోల్పోయి మొదటికే మోసం వస్తుంది. ఇదంతా ఎందుకనుకొని టాస్ గెలిచినవాళ్లు ఫస్ట్ బ్యాటింగ్ కి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదని, బౌలింగ్ వైపే మొగ్గుతున్నారని అనుకోవచ్చు.

 

ఫీలింగ్ ఎంచుకుంటే మరో నష్టం..

ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంటే జట్టులోని ప్లేయర్లంతా బంతి కోసం అటూ ఇటూ పరుగెత్తి అలసిపోయే అవకాశం ఉంది. ఒక ఇన్నింగ్స్ అయిన వెంటనే అప్పటి వరకూ ఫీల్డింగ్ చేసినవాళ్లు బ్యాటింగ్ కి దిగితే అంత యాక్టివ్ గా ఉండలేరు. ఫీల్డింగ్ వల్ల నీరసించిపోతారు కాబట్టి. అదే ముందుగా బ్యాటింగ్ చేస్తే తర్వాత ఫీల్డింగ్ సమయంలో పెద్దగా ఇబ్బంది అనిపించదు. ఎందుకంటే బ్యాటింగ్ కి అందరూ ఒకేసారి దిగరు. ఒకరి తర్వాత ఒకరు వస్తారు. కాబట్టి మెజారిటీ ఆటగాళ్లకు రెస్ట్ దొరుకుతుంది. కాగా ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ఇప్పటికి 8 మ్యాచ్ లు జరిగితే 8 సార్లూ టాస్ గెలిచిన జట్టే ఫీల్డింగ్ ని సెలెక్ట్ చేసుకున్నా ఫలితమేమీ మారలేదు. టాస్ గెలిచినవాళ్లు నాలుగు సార్లు మాత్రమే మ్యాచ్ లను సొంతం చేసుకోగలిగారు. మిగతా నాలుగు సార్లు ఓడారు. కాబట్టి టాసే బాస్ కాదు. పెర్ఫార్మెన్సే ఫైనల్.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us