IPL-14 Match-6 : బెంగళూరుకి వరుసగా రెండో విజయం.. మళ్లీ హైదరా‘బ్యాడ్’

IPL-14 Match-6 : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా రెండో మ్యాచ్ లోనూ విజయం సాధించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ పై 6 పరుగుల తేడాతో నెగ్గింది. గ్లెన్ మ్యాక్స్ వెల్ 59 పరుగులు చేసి బెంగళూరుకి గౌరవప్రదమైన స్కోరు అందించాడు. దీంతో కోహ్లీసేన దూసుకుపోతోంది. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ కి దిగిన హైదరాబాద్ జట్టులో కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఒక్కడే హాఫ్ సెంచరీ చేసి జట్టును ఆదుకున్నాడు. మనీష్ పాండే 38, రషీద్ ఖాన్ 17, బెయిర్ స్టో 12 పరుగులు సాధించారు. మిగతావాళ్లంతా సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. చివరికి 20 ఓవర్లు ఆడి 9 వికెట్లు కోల్పోయి 143 రన్నులు చేయగలిగారు. బెంగళూరు బౌలర్లలో షాబాద్ అహ్మద్ మూడు; తెలుగోడు మహ్మద్ సిరాజ్ రెండు; జెమిసన్, హర్షల్ పటేల్ ఒకటి చొప్పున వికెట్లు నేలకూల్చారు.

మళ్లీ ఫీల్డింగే..

ఇవాళ బుధవారం రాత్రి చెన్నైలో జరిగిన ఐపీఎల్ 14వ సీజన్ లోని 6వ మ్యాచ్ లో హైదరాబాద్, బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ రెండు టీమ్ లకీ ఇది రెండో మ్యాచ్. ఈ సీజన్ లో ఆడిన తొలి మ్యాచ్ లో హైదరాబాద్ కోల్ కతా చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. మరో వైపు టోర్నీ మొదటి మ్యాచ్ లోనే బెంగళూరు ముంబైని ఓడించి హుషారుగా ఉంది. వరుసగా ఆరో మ్యాచ్ లోనూ టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగే ఎంచుకుంది. హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా అదే చేశాడు. దీంతో బెంగళూరు జట్టు బ్యాటింగ్ కి దిగింది. బెంగళూరు కెప్టెన్ కోహ్లీ, పడిక్కల్ ఓపెనర్లుగా వచ్చారు.

IPL-14 Match-6 : second victory for bangalore team
IPL-14 Match-6 : second victory for bangalore team

హైదరాబాద్ కి 150 టార్గెట్: IPL-14 Match-6

3వ ఓవర్ లో పడిక్కల్ (11) ఔట్ అయ్యాడు. దీంతో షాబాజ్ అహ్మద్ క్రీజులోకి వచ్చాడు. నాలుగు ఓవర్లు ఆడి ఏడో ఓవర్ లో 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ కి చేరాడు. వెంటనే మ్యాక్స్ వెల్ రంగంలోకి దిగాడు. కోహ్లీ, మ్యాక్స్ వెల్ 10 ఓవర్లకి జట్టు స్కోర్ ని 63/2 వద్దకు తేగలిగారు. 13వ ఓవర్ లో కోహ్లీ (33) వెనుదిరిగాడు. ఏబీ డివిలియర్స్ వచ్చాడు. అతనూ తర్వాతి ఓవర్ లోనే వచ్చిన దారిన వెళ్లాడు. దీంతో సుందర్ ఎంట్రీ ఇచ్చాడు. 15 ఓవర్లకి టీమ్ స్కోర్ 103/4 మాత్రమే. 16వ ఓవర్ లో సుందర్ (8) ఔట్. డానియల్ ఇన్. 17వ ఓవర్ లో డానియెల్ సైతం చేతులెత్తేశాడు. ఆఖరి (20వ) ఓవర్ లో జెమీసన్ ఔట్. మొత్తమ్మీద 20 ఓవర్లలో 149/8 సాధించారు. మ్యాక్స్ వెల్ 59 రన్నులు చేశాడు. హైదరాబాద్ కి 150 పరుగల లక్ష్యాన్ని పెట్టారు. హైదరాబాద్ టీమ్ లోని ఐదుగురు బౌలర్లూ కనీసం ఒకటి చొప్పున వికెట్ పడగొట్టారు. జేసన్ హోల్డర్ కి మూడు వికెట్లు దక్కాయి.

Advertisement