IPL-14 Match-5 : ముంబై మురిసెన్.. కోల్ కతాపై..

IPL-14 Match-5 : చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇవాళ మంగళవారం రాత్రి జరిగిన ఐపీఎల్ 14వ సీజన్ లోని 5వ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ విజయం సాధించారు. కోల్ కతా నైట్ రైడర్స్ పై 10 పరుగుల తేడాతో నెగ్గారు. ఈ రెండు టీమ్ లకూ ఇది రెండో మ్యాచ్ కావటం గమనార్హం. మొదటి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయిన రోహిత్ సేన ఎట్టకేలకు రెండో ప్రయత్నంలో విజయబాట పట్టింది. తొలి మ్యాచ్ లో హైదరాబాద్ పై పైచేయి సాధించిన కోల్ కతా నైట్ రైడర్స్ రెండో మ్యాచ్ లో అంటే ఇవాళ పరాజయం పాలయ్యారు.

రాణా రాణించినా..

153 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ కి దిగిన కోల్ కతాకి శుభారంభం లభించింది. నితీష్ రాణా(57), శుభ్ మన్ గిల్(33).. డెబ్బై పరుగులకి పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ దాన్ని తర్వాత వచ్చినవాళ్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేదు. 20 ఓవర్లు ఆడారు కానీ 7 వికెట్లు కోల్పోయి 142 పరుగులు మాత్రమే చేయగలిగారు. ముంబై బౌలర్లలో రాహుల్ చాహర్ 4 వికెట్లు పడగొట్టాడు. ట్రెంట్ బౌల్ట్ ఒక వికెట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

టాస్ గెలిస్తే.. బౌలింగే..

ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్ ల్లోనూ టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా ముందుగా బౌలింగే ఎంచుకున్నాడు. మొన్న హైదరాబాద్ తో జరిగిన తన మొదటి మ్యాచ్ లో కోల్ కతా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ ఉత్సాహంతో ఈ రోజు టాస్ నెగ్గిన కోల్ కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మొదట ఫీల్డింగే ఎంచుకున్నాడు. దీంతో ముంబై జట్టు బ్యాటింగ్ కి దిగాల్సి వచ్చింది. సారథి రోహిత్ శర్మ, క్వింటన్ డీకాక్ ఓపెనర్లుగా వచ్చారు. కానీ రెండో ఓవర్ లోనే డీకాక్ ఔట్ అయ్యాడు. సూర్య కుమార్ క్రీజులోకి ఎంట్రీ ఇచ్చాడు.

ipl-14-match-5 : mumbai indians won the match on kolkata night riders
ipl-14-match-5 : mumbai indians won the match on kolkata night riders

సూర్య హాఫ్ సెంచరీ: IPL-14 Match-5

సూర్య కుమార్ 11వ ఓవర్ వరకు ఉండి ధాటిగా ఆడి 36 బంతుల్లోనే 56 పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు. కానీ.. రోహిత్ శర్మకి చక్కని సహకారం అందించాడు. సూర్య తర్వాత ఇషాన్ కిషన్ రంగంలోకి దిగాడు. కానీ ఇతను తర్వాతి ఓవర్ లోనే పెవిలియన్ కి చేరాడు. 16వ ఓవర్ లో 43 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఔటయ్యాడు. అనంతరం 19.5 ఓవర్లకే అంటే మరో బాల్ మిగిలి ఉండగానే ముంబై జట్టు ఆలౌట్ అయింది. కోల్ కతాకి 153 రన్నుల తక్కువ టార్గెట్ పెట్టింది. కోల్ కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, షకిబ్ అల్ హసన్, ప్రసిధ్ ఒక్కొక్కటి చొప్పున, కమిన్స్ రెండు వికెట్లు తీశారు. ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్ విజృంభించాడు. రెండు ఓవర్లు మాత్రమే వేసి 5 వికెట్లు తీశాడు.

Advertisement