IPL-14 Match-28 : ‘హైదరాబాద్’ని ఉతికి ఆరేసిన జోస్ బట్లర్

IPL-14 Match-28: ఈ రోజు ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఐపీఎల్ 14వ సీజన్ లోని 28వ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఘన విజయం సాధించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ పై 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ ప్లేయర్ జోస్ బట్లర్ హైదరాబాద్ ని ఒక ఆటాడుకున్నాడు. సెంచరీతో కదం తొక్కి జట్టుకు ఒంటి చేత్తో గెలుపును అందించాడు. 221 రన్నుల టార్గెట్ ను అందుకునేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్ కి శుభారంభం లభించిన ఫలితం లేకుండా పోయింది. 20 ఓవర్లు ఆడి 8 వికెట్లు కోల్పోయి 165 పరుగులు మాత్రమే చేసింది. మనీష్ పాండే 31, జానీ బెయిర్ స్టో 30, కొత్త కెప్టెన్ కేన్ విలియమ్సన్ 20, విజయ్ శంకర్ 8, మహ్మద్ నబి 17, అబ్దుల్ సమద్ 10, కేదార్ జాదవ్ 19 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో క్రిస్ మోరిస్ 3, ముస్తాఫిజుర్ రెహ్మాన్ 3, రాహుల్ తెవాతియా 1, కార్తీక్ త్యాగి 1 వికెట్ తీశారు.

కింద నుంచి వచ్చాయి

పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో నిలిచిన రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఈ రోజు ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో తలపడ్డాయి. ఈ రెండు టీమ్ లూ ఇప్పటివరకు ఆరు మ్యాచ్ ల చొప్పున ఆడాయి. రాజస్థాన్ రాయల్స్ రెండు సార్లు నెగ్గా హైదరాబాద్ ఒక్కసారి మాత్రమే విజయం సాధించి చిట్టచివరి స్థానంతో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో జట్టు మేనేజ్మెంట్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పై వేటు వేసి అతని స్థానంలో కేన్ విలియమ్సన్ కి పగ్గాలు అప్పగించింది. ఈ పరిస్థితుల్లో టాస్ గెలిచిన హైదరాబాద్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కి దిగింది.

జోస్ బట్లర్ జోష్

రాజస్థాన్ రాయల్స్ జట్టు హైదరాబాద్ కి 221 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ టీమ్ లోని ఓపెనర్ జోస్ బట్లర్ 64 బంతుల్లోనే 124 పరుగులు చేయటం విశేషం. ఇందులో 11 ఫోర్లు, 8 సిక్సులు ఉండటం గమనార్హం. అతనికి కెప్టెన్ సంజూ శాంసన్ కూడా తోడయ్యాడు. 33 బాల్స్ కి 48 పరుగులు చేసి కొద్దిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. మొత్తానికి రాజస్థాన్ రాయల్స్ టీమ్ 20 ఓవర్లు ఆడి 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 220 రన్నులు నమోదు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్, విజయ్ శంకర్, సందీప్ శర్మ చెరో వికెట్ చొప్పున నేలకూల్చారు.

 

Advertisement