Pawan Kalyan సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరు పెంచిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ , క్రిష్ దర్శకత్వంలో 27వ చిత్రం, సాగర్ కె చంద్ర డైరెక్షన్లో ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ చిత్రాలు చేస్తున్నాడు. ఈ సినిమాలపై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే గత కొద్ది రోజులుగా క్రిష్ సినిమా టైటిల్‌పై అనేక వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అప్పట్లో‘విరూపాక్ష’, ‘గజదొంగ’, ‘హరహర మహాదేవ్’, ‘ఓం శివమ్’, ‘బందిపోటు’ వంటి టైటిల్స్ చక్కర్లు కొట్టగా ,రీసెంట్గా హరిహర వీరమల్లు అనే టైటిల్ అనుకుంటున్నట్టు ప్రచారం జరిగింది. తాజాగా ఈ మూవీకి కథను బట్టి వీరమల్లు అనే పవర్ఫుల్ టైటిల్‌ని ఖరారు చేసినట్లుగా సమాచారం.
పవన్-క్రిష్ మూవీకి సంబంధించి ఇప్పటికే ప్రీ లుక్ విడుదల కాగా, ఇందులో పవన్ గతంలో ఎప్పుడు కనిపించని లుక్‌లో కనిపించాడు. ఇందులో పవన్ కళ్యాణ్ బంధిపోటుగా, వజ్రాల దొంగగా కనిపించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరియర్లోనే ఓ మైలురాయిగా నిలిచిపోయే చిత్రంగా ఉండేలా మేకర్స్ రూపొందిస్తున్నారట. ముందు విరూపాక్ష అనే టైటిల్ పెట్టాలని మేకర్స్ భావించినప్పటికీ, అంతకన్నా ముందుగానే ఆ టైటిల్‌ని ఛాంబర్లో రిజిస్టర్ చేసుకోవడంతో వీరమల్లు టైటిల్‌కు ఫిక్స్ అయ్యారని ఇన్సైడ్ టాక్.
పీరియాడికల్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్.. ‘ఔరంగజేబు’ పాత్రలో కనిపించనున్నాడట. అప్పట్లో ఆ పాత్ర కోసం సంజయ్ దత్ పేరు వినిపించగా, ఇప్పుడు అర్జున్ రాంపాల్ అంటున్నారు. చిత్ర కథానాయికలుగా జాక్వలిన్ ఫెర్నాండేజ్, ఇస్మార్ట్ పోరి నిధి అగర్వాల్ ని ఎంపిక చేశారు.సంచలన సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దాదాపు ఈ ఏడాదిలోనే పవన్ 27వ సినిమాని రిలీజ్ చేసేలా క్రిష్ సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ తన 27వ సినిమాతో పాటు అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ చిత్ర షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు. ఈ మూవీస్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో కమర్షియల్ ఎంటర్టైనర్ చేయనున్నాడు.