Movie Theaters : సినిమా థియేటర్స్‌ని మ‌ళ్లీ టార్గెట్ చేసిన ఏపీ ప్ర‌భుత్వం.. మూడు థియేట‌ర్స్ సీజ్

Movie Theaters : గ‌త కొద్ది రోజులుగా ఏపీ ప్ర‌భుత్వం సినీ రంగంపై ప్ర‌త్యేక దృష్టి సారించిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్లు త‌గ్గించిన ప్ర‌భుత్వం పలు జిల్లాల్లో సినిమా హాళ్ళలో తనిఖీలు నిర్వహిస్తూ.. అనేక థియేటర్స్ ను మూసివేశారు. మరికొన్ని జిల్లాల్లో తాము థియేటర్స్ ను నడపలేమంటూ స్వచ్ఛందంగా మూసివేశారు. అయితే కొద్ది రోజులు స‌మ‌యం ఇచ్చి ప‌ర్మీష‌న్ తీసుకోమ‌ని చెప్పిన కొంద‌రు ప‌ట్టించుకోలేదు.

In AP again Movie Theaters restrictions
In AP again Movie Theaters restrictions

దీంతో సినిమా థియేటర్లపై రెవెన్యూ శాఖ అధికారుల దాడులు.. మళ్లీ మొదలయ్యాయి. సంక్రాంతి పండగ వేళ ఈ దాడులు చేపట్టడం కలకలం రేపుతోంది. ప్రభుత్వం గడువు ఇచ్చినప్పటికీ.. లైసెన్స్‌ను పునరుద్ధరించుకోకపోవడం, భద్రతా ప్రమాణాలను పాటించని థియేటర్లపై అధికారులు కొరడా ఝుళిపించడం షురూ చేశారు. ఈ తనిఖీలు, దాడులను మరింత ముమ్మరం చేయనున్నారు.

తాజాగా- చిత్తూరు జిల్లా శ్రీకాకుళంలో మూడు సినిమా థియేటర్లను స్థానిక రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. వాటికి తాళాలు వేశారు. థియేటర్ లైసెన్సులను పునరుద్ధరించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందున ఈ మూడు థియేటర్లను సీజ్ చేయాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. సంవత్సర కాలంగా ఆయా థియేటర్ల యజమానులు తమ లైసెన్సులను రెన్యూవల్ చేయించుకోలేదని అధికారుల తనిఖీల్లో తేలింది.

థియేటర్ల లైసెన్సులను పునరుద్ధరించుకోవడానికి ప్రభుత్వం వాటి యజమానులకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. నెల రోజుల్లో థియేటర్ల యజమానులందరూ లైసెన్సులను రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుందని, లేదంటే మళ్లీ దాడులు తప్పవంటూ కొద్ది రోజుల కిందటే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని హెచ్చరించిన విషయం తెలిసిందే.

థియేటర్లల్లో కనీస భద్రత ప్రమాణాలు పాటించడం, పార్కింగ్ వంటి స్థలాల్లో సీసీటీవీ కెమెరాలను అమర్చుకోవడం, టికెట్లను విక్రయించినప్పుడు వాటికి సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించడం వంటి కనీస చర్యలను కూడా థియేటర్ల యజమానులు పాటించట్లేదంటూ ఈ దాడుల్లో ఇదివరకే స్పష్టమైంది.