Hi Nanna Movie Review : ‘హాయ్ నాన్న’ సినిమా రివ్యూ

NQ Staff - December 7, 2023 / 01:11 PM IST

Hi Nanna Movie Review : ‘హాయ్ నాన్న’ సినిమా రివ్యూ

తారాగణం: నాని, మృణాల్ ఠాకూర్, కియారా ఖన్నా, ప్రియదర్శి, జయరామ్ అంగద్ బేడి, విరాజ్ అశ్విన్, శ్రుతి హాసన్ (గెస్ట్), నాజర్
పాటలు: అనంత శ్రీరామ్, కృష్ణకాంత్
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
సినిమాటోగ్రఫీ: సాను వర్ఘీస్
ఎడిటింగ్: ప్రవీణ్ ఆంథోనీ
ప్రొడక్షన్ డిజైన్: అవినాశ్ కొల్లా
స్టంట్స్: విజయ్, పృథ్వీ
నిర్మాతలు: మోహన్ చెరుకూరి, విజేందర్ రెడ్డి తీగల
దర్శకత్వం: శౌర్యువ్
బ్యానర్: వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ: 7 డిసెంబర్ 2023

నాని, మృణాల్ ఠాకూర్ జంటగా ‘హాయ్ నాన్న!’ అనే సినిమా రూపొందుతోందనే విషయం బయటకు వచ్చినప్పట్నుంచీ దాని కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారనేది నిజం. ‘సీతా రామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మృణాల్ చెరగని ముద్ర వేయడం కూడా దీనికి ఒక కారణం. శౌర్యువ్ అనే కొత్త దర్శకుడు తీసిన ఈ సినిమా ఎలా ఉందంటే…

కథ:

విరాజ్ (నాని) ఒక ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్. కూతురు మహీ (కియారా ఖన్నా) ’65 రోజెస్’ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. సింగిల్ పేరెంట్‌గా ఆమెను పెంచుతుంటాడు విరాజ్. ఒకసారి రోడ్డుపై సందర్భవశాత్తూ మహీని యష్ణ (మృణాల్ ఠాకూర్) కాపాడుతుంది. క్లాస్ ఫస్ట్ వస్తే అమ్మ కథ చెప్తానని ప్రామిస్ చేసి, దాన్ని నిలబెట్టుకోలేకపోయిన తండ్రిని ఆ కథ చెప్పమని యష్ణ సమక్షంలో అడుగుతుంది మహీ. అప్పుడు తమ ప్రేమకథ చెప్తాడు విరాజ్. ఆ తర్వాత ఏం జరిగింది? విరాజ్ భార్య ఎవరు? వాళ్లెందుకు విడిపోయారు? విరాజ్ జీవితంలో యష్ణ పాత్రేమిటి? అని విషయాలు మిగతా కథలో భాగం.

విశ్లేషణ …

ఒక ఫీల్ గుడ్ మూవీగా ‘హాయ్ నాన్న’ను మన ముందుకు తెచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు శౌర్యువ్. అందులోనూ కొన్ని ట్విస్టులు పెట్టుకున్నాడు. ఇంటర్వెల్‌లో విరాజ్ భార్య ఎవరనే విషయాన్ని రివీల్ చేసి ట్విస్ట్ ఇచ్చాడు. అలాగే జయరాం క్యారెక్టర్‌కు సంబంధించిన ట్విస్ట్ క్లైమాక్స్‌కు ముందు వస్తుంది. ప్రథమార్ధం మరీ ఫ్లాట్‌గా నడిచిన ఫీలింగ్ కలుగుతుంది. ద్వితీయార్ధంలో కథనం కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. హిమాచల ప్రదేశ్ నేపథ్యంలో చిత్రీకరించిన విరాజ్ లవ్ స్టోరీ సీన్లు సీనిక్ బ్యూటీతో అలరించాయి. సినిమా మొత్తంలో యష్ణ క్యారెక్టరైజేషన్ కీలకం. సెకండాఫ్‌లో ఆ పాత్ర పడే మానసిక సంఘర్షణ హృదయాన్ని కదిలిస్తుంది.

Hi Nanna Movie Review

Hi Nanna Movie Review

శ్రుతి హాసన్ క్యారెక్టర్ ఏమిటో అర్థం కాదు. ఆమె ఎందుకు వస్తుందో, ‘ఓడియమ్మా’ అనే పాట సందర్భమేమిటో బోధపడదు. ఆ పాట సీక్వెన్స్ పంటికింద రాయి. శ్రుతికి కథలో రవ్వంత ప్రాముఖ్యం కూడా లేదు. సినిమా అంతా విరాజ్, యష్ణ, మహీ పాత్రల చుట్టూ నడుస్తుంది. సెకండాఫ్‌లో యష్ణ ఫియాన్సీ డాక్టర్ అరవింద్‌గా బాలీవుడ్ యాక్టర్ అంగద్ బేడి సీన్‌లోకి వచ్చి, క్లైమాక్స్‌లో కీలకంగా వ్యవహరిస్తాడు. చివరి అరగంట ఎమోషనల్‌గా హృదయాల్ని టచ్ చేస్తుంది.

మూవీకి హేషం అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ ఎస్సెట్. స్లోగా నడిచే కథకు నేపథ్య సంగీతమే ఆయువుపట్టుగా నిలిచింది. ‘ఓడియమ్మా’ పాట తప్పితే మిగతా పాటలు బాగానే ఉన్నాయి. సాను వర్ఘీస్ కెమెరా పనితనం సినిమాకి రిచ్ లుక్ తెచ్చింది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్‌గా ఉంటే బాగుండనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

నటీనటుల అభినయం…

విరాజ్‌గా నాని సూపర్బ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ప్రాణాంతక వ్యాధితో బాధపడే కూతురి తండ్రిగా ఆ క్యారెక్టర్‌లోని బరువును బాగా మోశాడు. యష్ణ రోల్‌లో మృణాల్ మరోసారి అదరగొట్టేసింది. ‘సీతారామం’లో తన బ్యూటీతో, స్మైల్‌తో మన హృదయాల్ని దోచుకున్న ఆమె ‘హాయ్ నాన్న’లో సంఘర్షణతో కూడిన క్యారెక్టర్‌ను గొప్పగా పోషించింది. మహీ పాత్రను చేసిన కియారా నటనను మెచ్చుకోకుండా ఉండలేం. ఆమె ఎక్స్‌ప్రెషన్స్ అమితంగా ఆకట్టుకుంటాయి. యష్ణ తల్లిగా నటించిన నటి బాగా చేసింది. విరాజ్ ఫ్రెండ్ జస్టిన్‌గా ప్రియదర్శి, మహీ తాతగా జయరాం, యష్ణ ఫియాన్సీ డాక్టర్ అరవింద్‌గా అంగద్ బేడి తమ పాత్రలకు చక్కని న్యాయం చేకూర్చారు. విరాజ్ అశ్విన్, నాజర్ తదితరులు పరిధుల మేరకు నటించారు. శ్రుతి హాసన్ గెస్ట్ అప్పీరెన్స్ వేస్ట్.

Hi Nanna Movie Review

Hi Nanna Movie Review

ప్లస్ పాయింట్స్…

నాని, మృణాల్ నటన, వాళ్ల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ
ఫీల్ గుడ్ స్టోరీలోని ట్విస్టులు, క్లైమాక్స్
బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్….

స్లో నెరేషన్
శ్రుతి హాసన్ ప్రెజెన్స్, ‘ఓడియమ్మా’ సాంగ్
కొన్ని సన్నివేశాల్ని కల్పించిన తీరు

న్యూస్‌క్యూబ్ వర్డిక్ట్…

స్లో నెరేషన్‌తో సాగే ‘హాయ్ నాన్న’ ఒక ఫీల్ గుడ్ మూవీగా క్లాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుంది. బీ, సీ సెంటర్ల మాస్ ఆడియెన్స్‌ను ఈ సినిమా మెప్పించడం కష్టం. నాని, మృణాల్ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ కోసమైనా ఈ సినిమాని చూసేయొచ్చు.

                                                        రేటింగ్: 3/5

                                      – బుద్ధి యజ్ఞమూర్తి

Read Today's Latest సినిమా రివ్యూలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us