Hema: మాలో మ‌రో ట్విస్ట్‌.. న‌రేష్‌,క‌ళ్యాణిపై హేమ ఫిర్యాదు

Hema: మూవీ ఆర్టిస్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల నేపథ్యంలో సినిమా ఇండ‌స్ట్రీలో లుక‌లుక‌లు మొద‌ల‌య్యాయి. ఇరు ప‌క్షాల ప్యానెల్ స‌భ్యులు ఒక‌రిపై ఒక‌రు ఫిర్యాదులు చేసుకుంటున్నారు .ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు చెందిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ బుధవారం మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు లేఖ రాశారు. తనపై కరాటే కల్యాణి , నరేశ్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని హేమ ఆరోపించారు

Hema Registered Complaint Against Naresh and Karate Kalyani
Hema Registered Complaint Against Naresh and Karate Kalyani

ఫొటోలు మార్ఫింగ్‌ చేసి, తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు హేమ‌. నాపై కుమారి కళ్యాణి అలియాస్‌ కరాటే కళ్యాణి, వి.నరేశ్‌లు కొన్ని అవాంఛితమైన, పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలతో ఒక వీడియోను విడుదల చేశారు. సినీ రంగానికి చెందిన నటీమణుల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి, వాటికి అసభ్యకరమైన వ్యాఖ్యలను జోడించి, కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లలో పోస్ట్ చేస్తున్నారు.

గతంలో ఈ విషయమై నేను సైబర్‌సెల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశా. ఆ తరువాత ఇలాంటి ఘటనలు తగ్గాయి. తాజాగా ఆ ఘటనకు సంబంధించిన విషయాన్ని కళ్యాణి ప్రస్తావిస్తూ ‘నేను పోలీసుల వద్దకు వెళ్లినప్పుడు వారు నాకు సంబంధించిన కొన్ని అసభ్యకరమైన ఫొటోలను ముందుగా సోషల్‌మీడియా నుంచి తొలగించమని సలహా ఇచ్చినట్లు’ వ్యాఖ్యానించారు. కళ్యాణి వ్యాఖ్యలను నరేశ్‌ కూడా సమర్థించారు. నేను అమర్యాదకరమైన ఫొటోలను గ్రూపుల్లో పెట్టి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నట్లు కూడా తాజా వీడియోలో పేర్కొన్నారు.

నరేశ్‌ వైఖరి నన్ను అగౌరవ పరిచేలా, నా వ్యక్తిత్వాన్ని కించరిచేలా ఉంది. వీరి వల్ల సంస్థకు చెడ్డ పేరు రావటమే కాకుండా, కొందరు సభ్యులు కూడా వీరి ధోరణిని అనుసరించే ప్రమాదం ఉంది. అందువల్ల వారికి ఈసారి ఓటు హక్కు లేకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకొమ్మని కోరుతున్నా. కృతజ్ఞతలతో హేమ’’ అని లేఖలో పేర్కొన్నారు. తనపై నరేశ్‌, కళ్యాణిలు చేసిన వ్యాఖ్యల వీడియోలను తొలగించాల్సిందిగా ఆయా యూట్యూబ్‌ యాజమాన్యాల పైనా సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు హేమ తెలిపారు