God of.. : ‘దేవుడు’ ఇచ్చిన డబ్బులు.. రూ.100 లక్షలు..

God of.. : మన దేశంలో క్రికెట్ అనేది ఒక ఆట మాత్రమే కాదు. ఒక మతం కూడా. ఆ మతానికి దేవుడు సచిన్ టెండుల్కర్. స్వయంగా కొవిడ్-19 వైరస్ బారినపడి కోలుకున్న ఆయనకి ఆ బాధితుల ఇబ్బందులు తెలుసు. అందుకే మనవత్వం ప్రదర్శించాడు. ఏకంగా వంద లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించినట్లు సమాచారం. తద్వారా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. ప్రజలను ఒకప్పుడు తన ఆటతో అలరించిన ఆయన ఇప్పుడు మనసుతో ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు. తనకు ఎంతో ఇచ్చిన ఈ దేశం తన కళ్ల ముందే ఆక్సీజన్ కోసం అల్లాడుతుంటే చూస్తూ ఊరికే ఉండలేకపోయాడు. తక్షణం స్పందించాడు. ‘కరోనా సెకండ్ వేవ్ వల్ల ఆరోగ్య వ్యవస్థపై అనుకోని భారం పడింది. చాలా మంది కొవిడ్ బాధితులకు ఆక్సీజన్ అందించటం అత్యవసరం’ అని ట్విట్టర్ లో పేర్కొన్నాడు. చెప్పటమే కాకుండా చేసి చూపించాడు. వివిధ ఆస్పత్రులకు ప్రాణవాయువును సరఫరా చేసేందుకు నిధులను సమీకరిస్తున్న ‘మిషన్ ఆక్సీజన్’ అనే సంస్థకు ఈ మొత్తాన్ని అందించాడు. ‘‘ఇది చాలా గొప్ప విషయం’’ అని ఆ ఆర్గనైజేషన్ ఒక ప్రకటనలో ప్రశంసించింది.

రాజస్థాన్ రాయల్స్ 7.5 కోట్లు..

కరోనా సహాయ చర్యల కోసం ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ భారీ విరాళం ప్రకటించింది. టీమ్ తరఫున ఏడున్నర కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నామని తెలిపింది. ప్లేయర్స్, టీం ఓనర్లు, టీం మేనేజ్మెంట్ అందరూ కలిసి ఈ మొత్తాన్ని సేకరించారని చెప్పింది. బ్రిటిష్ ఏషియన్ ట్రస్ట్ కూడా ఇందులో ఉన్నట్లు వెల్లడించింది. మరో ఐపీఎల్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ కోటిన్నర రూపాయల సాయం ప్రకటించింది. టీం కో-ఓనర్స్ తమ జేఎస్ డబ్ల్యూ, వరలక్ష్మి ఫౌండేషన్ల తరఫున ఈ అమౌంట్ ఇస్తున్నారు. ఢిల్లీలోని రెండు స్వచ్ఛంద సంస్థలకు ఈ డబ్బులు అందిస్తామని తెలిపింది. అందరి కన్నా ముందు కోల్ కతా నైట్ రైడర్స్ పేస్ బౌలర్ ప్యాట్ కమిన్స్ 50 వేల డాలర్ల భారీ విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement