Shakunthalam Movie : శాకుంతలం ఫస్ట్ సింగిల్.. మనసుకు హత్తుకునే మల్లిక మల్లిక
NQ Staff - January 19, 2023 / 09:45 AM IST

Shakunthalam Movie : సమంత ప్రధాన పాత్రలో రూపొందిన శాకుంతలం సినిమా మొదటి పాటను చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు. మల్లికా మల్లికా అంటూ సాగే ఈ పాటకు మణిశర్మ స్వరాలు సమకూర్చగా, చైతన్య ప్రసాద్ సాహిత్యాన్ని అందించారు. రమ్య బెహరా మనసుకు హత్తుకునే విధంగా ఆలపించారు.
లిరికల్ వీడియో పాటకు మరింతగా సొగసులు అద్దింది అనడంలో సందేహం లేదు. సమంత ను అందంగా చూపించడంతో పాటు చక్కనైన విజువల్ ఎఫెక్ట్స్ తో పాటను విజువల్ ట్రీట్ గా రూపొందించారు.
ఆకట్టుకునే సాహిత్యంతో పాటు మనసును ఓలలాడించే విధంగా సంగీతం ఉండడంతో పాటకు మంచి స్పందన దక్కే అవకాశం ఉంది. ఈ పాట సినిమా లో శకుంతల తన ప్రియుడి కోసం అన్వేషించే సమయంలో వచ్చే విధంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశంలో లేదా సమంత ఇంట్రడక్షన్ లో ఈ పాట ఉండే అవకాశం ఉందని అనిపిస్తుంది.
సమంతతో పాటు ఈ సినిమాలో దేవ్ మోహన్, అల్లు అర్హ, కబీర్ బేడి, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, మధుబాల, గౌతమి ఇంకా పలువురు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మొదటి పాట శ్రోతలను ఆకట్టుకునే విధంగా ఉండడంతో సినిమాపైన అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ దక్కించుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.