Father-Son: ఏడు రోజులు.. ఆరు రాత్రులు..

Father-Son: ఏడు రోజులు.. ఆరు రాత్రులు.. దీన్నే ఇంగ్లిష్ లో ‘7 డేస్.. 6 నైట్స్’ అంటారు. ఇదొక తెలుగు సినిమా పేరు. టైటిల్ చాలా వెరైటీగా ఉంది కదా. ఈ మూవీకి తెర వెనక ఉన్న మరో కాంబినేషన్ కూడా ఇంకా వెరైటీగా ఉంటుంది. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు డైరెక్షన్ చేయబోతున్నారు. నిర్మాతగా ఆయన కొడుకు సుమంత్ అశ్విన్ వ్యవహరించనున్నాడు. ఇందులో వెరైటీ ఏముంది అనుకోవచ్చు. ఎందుకు లేదు?. తండ్రి నిర్మాతగా, దర్శకుడిగా ఉండి కొడుకును హీరోగా పెట్టి పిక్చర్లు తీసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ.. తండ్రి డైరెక్టర్ గా ఉంటే కుమారుడు ప్రొడ్యూజర్ గా చేయటం మాత్రం అరుదనే చెప్పాలి.

అదే ఉత్సాహంతో..

ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో ఇటీవల విడుదలైన ‘డర్టీ హరి’ అనే సినిమాపై మీడియాలో బాగా చర్చ జరిగింది. ఆ మూవీ పోస్టర్లపై కొందరు అభ్యంతరం కూడా చెప్పారు. అయితే ఆ ఫిల్మ్ హిట్ అయిందని, మంచి కలెక్షన్లను రాబట్టిందని తెలుస్తోంది. ఆ ఉత్సాహంతోనే ఎమ్మెస్ రాజు మరో చిత్రానికి డైరెక్షన్ చేయటానికి ముందుకు వచ్చారని అంటున్నారు. పలు చిత్రాల్లో హీరోగా నటించిన యువ కథా నాయకుడు సుమంత్ అశ్విన్ నిర్మాతగా సరికొత్త పాత్ర పోషించనుండటం ఆసక్తికరం. హీరోగా పెద్దగా క్లిక్ కాలేకపోయిన సుమంత్ అశ్విన్ ఇటీవలే పెళ్లి చేసుకున్న విషయం విధితమే. వివాహం అనంతరం ప్రొడ్యూసర్ గా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నట్లు భావించొచ్చు.

ఎమ్మెస్ రాజు పుట్టిన రోజున..

‘డర్టీ హరి’ సినిమాతో ఎమ్మెస్ రాజు ఆల్రెడీ తనలోని రొమాంటిక్ టేస్ట్ ని ప్రేక్షకులకు చూపించారు. మళ్లీ అదే యాంగిల్ లో కాస్త కామెడీని జోడించి ఈ ‘7 డేస్ 6 నైట్స్’ అనే చిత్రాన్ని ఇంకాస్త ఎంటర్టైనర్ గా రూపొందించనున్నారు. ఈ టైటిల్ ని బట్టే స్టోరీ ఏంటో అర్థంచేసుకోవచ్చు. హీరో, హీరోయిన్లు ఇతర తారాగణం వివరాలను వచ్చే నెల 10వ తేదీన ఎమ్మెస్ రాజు పుట్టిన రోజు సందర్భంగా ప్రకటిస్తారంట. సంగీత దర్శకుడిగా 14 ఏళ్ల కుర్రోడు, యూట్యూబ్ మ్యూజిక్ సెన్సేషన్ సమర్ధ్ గొల్లపూడిని పరిచయం చేస్తున్నారు. ప్రస్తుతం పాపులర్ సంగీత దర్శకుడుగా చెలామణి అవుతున్న దేవీశ్రీప్రసాద్ కి ఎమ్మెస్ రాజే తన ‘దేవి’ మూవీ ద్వారా తొలిసారి ఛాన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement