మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల వలన తొమ్మిదేళ్ళ పాటు సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఖైదీ నెం 150 చిత్రంతో ఆయన తిరిగి రీ ఎంట్రీ ఇవ్వగా, ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో మొదలు పెట్టిన ఖైదీ నెం 150 చిత్రాన్ని పెద్ద హిట్ చేశారు. అభిమానుల ప్రేమాభిమానాలు చూసి మురిసిపోయిన చిరంజీవి వరుస సినిమాలతో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రం చేస్తున్న చిరు, ఈ మూవీ తర్వాత లూసిఫర్ రీమేక్ , వేదాళం రీమేక్ చిత్రాలు చేయనున్నాడు. వీటి తర్వాత బాబీ దర్శకత్వంలోను ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడు.
భారీ అంచనాలతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఆచార్య చిత్రాన్ని సోషల్ మెసేజ్‌కు కాస్త కమర్షియల్ టచ్ ఇచ్చి తెరకెక్కిస్తున్నారు. కొరటాల శివ. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. శుక్రవారం సాయంత్రం 4:05 గంటలక ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. చిరంజీవి తల్లి అంజనా దేవి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తుంది. ‘ఇతరుల కోసం జీవించే వారు దైవంతో సమానం. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే.. ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పనిలేదు’ అనే రామ్ చరణ్ వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ టీజర్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. పలు రికార్డులని బ్రేక్ చేస్తుంది.
టీజర్లో చిరంజీవి మేనరిజం, ఆయన గ్రేస్ అభిమానులకు కొండంత ఆనందాన్ని ఇచ్చాయి. పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో’’ అంటూ చిరంజీవి చెప్పే డైలాగ్‌కు ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. మహిళా అభిమానులు అయితే టీవీలో టీజర్ పెట్టుకొని సంబరాలు చేసుకుంటున్నారు. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, ఓ మహిళాభిమాని టీవీలో కనిపిస్తున్న చిరంజీవికి హారతి ఇస్తుంది. కుటుంబ సభ్యులు చిందేస్తున్నారు. ఓ వృద్ధ మహిళ కూడా చిరు టీజర్‌కు డ్యాన్స్ చేస్తుండడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.ఆరు పదుల వయస్సులోను చిరు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ఈ వీడియో తెలియజేస్తుంది.
చిత్రంలో ‘సిద్ధ’ అనే కీలక పాత్రలో రామ్ చరణ్ కనిపించనున్నారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.