IND vs ENG: కోవిడ్ వ‌ల‌న క్యాన్సిల్ అయిన ఐదో టెస్ట్ రీ షెడ్యూల్ డేట్ ఫిక్స్..!

Tech Sai Chandu - October 22, 2021 / 08:15 PM IST

IND vs ENG: కోవిడ్ వ‌ల‌న క్యాన్సిల్ అయిన ఐదో టెస్ట్ రీ షెడ్యూల్ డేట్ ఫిక్స్..!

IND vs ENG: భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మ‌ధ్య మాంచెస్టర్‌ వేదికగా సెప్టెంబర్‌ 10న జ‌ర‌గాల్సిన చివరి టెస్ట్ మ్యాచ్‌ నాటకీయ పరిణామాల మధ్య ర‌ద్దైన విష‌యం తెలిసిందే. నాలుగో టెస్ట్‌కు ముందు తొలుత టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రికి కరోనా సోకగా.. అతని నుంచి బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌, ఫిజియో నితిన్ పటేల్‌లకు వైరస్ సోకింది.

IND vs ENG

అనంతరం ఐదో టెస్టుకు ముందు రోజు గురువారం (సెప్టెంబర్ 9) సాయంత్రం టీమిండియా జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్‌‌‌‌కు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లందరికీ ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయగా.. అందరికీ నెగెటివ్‌ వచ్చింది. అయినప్పటికీ భారత జట్టు ముందు జాగ్రత్త చర్యగా చివరి టెస్ట్‌లో ఆడలేమంటూ చేతులెత్తేసింది.

షెడ్యూల్‌ సమయానికి మూడు గంటల ముందు ర‌ద్దైన సంగతి తెలిసిందే. అయితే రద్దైన ఆ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేసేందుకు తాజాగా ఇరు దేశాల క్రికెట్‌ బోర్డులు అంగీకారం తెలిపాయి. వచ్చే ఏడాది జులైలో జరిగే ఇంగ్లండ్‌ పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌తో పాటు ఈ మ్యాచ్‌ నిర్వహించేందుకు బీసీసీఐ, ఈసీబీలు పరస్పర అంగీకారానికి వచ్చాయి​.

జూలై 1, 2022న ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంద‌ని ఈసీబీ ప్ర‌క‌టించింది. ఐదో టెస్ట్ త‌ర్వాత మూడు వ‌న్డేలు, మూడు టీ 20లు జ‌ర‌గ‌నున్నాయ‌ని బీసీసీఐ తెలిపింది. ఇక ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి టెస్ట్ డ్రాగా ముగియగా.. రెండో టెస్టులో భారత్, మూడో టెస్టులో ఇంగ్లాండ్ గెలుపొందాయి.

ఇక నాలుగో టెస్టులో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుని సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉంది. నిర్ణయాత్మక ఐదో టెస్ట్ రద్దు కావడంతో విజేత ఎవరన్నది తెలియాలంటే వచ్చే సంవత్సరం వరకు ఆగాల్సి ఉంది. 2022 జూలైలో టీమిండియా మరోసారి ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఆ సమయంలో ఈ ఐదో టెస్ట్ మ్యాచ్ నిర్వహించాలని ఈసీబీ.. బీసీసీఐకి విజ్ఞప్తి చేసింది. ఆ క్ర‌మంలోనే డేట్ ఫిక్స్ చేశారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us