Cricket: మ్యాచ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో గ్రౌండ్‌లోకి వ‌చ్చిన కుక్క‌.. బంతిని ఎత్తుకెళ్లి…

Cricket: మ్యాచ్‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో మ‌నుషులే కాదు కుక్క‌లు కూడా గ్రౌండ్‌లోకి వ‌చ్చి మ్యాచ్‌కి అంత‌రాయం క‌లిగిస్తున్నాయి. ఇటీవ‌ల జరిగిన ఇంగ్లండ్- భార‌త్ టెస్ట్ సిరీస్ మ్యాచ్ ల‌లో జార్వో అనే వ్య‌క్తి ప‌దే ప‌దే గ్రౌండ్‌లోకి వ‌చ్చి అంత‌రాయం క‌లిగించాడు. తాజాగా ఐర్లాండ్ దేశవాళీ క్రికెట్‌లో బుజ్జి కుక్క స‌డెన్‌గా వ‌చ్చి ఆట‌ని కొద్ది సేపు నిలిచేలా చేసింది.

Cricket

బ్రీడీ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన దేశవాళీ టోర్నీలో బ్రీడీ, సీఎస్‌ఎన్‌ఐ టీమ్స్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్‌కు కుక్క అంతరాయం కలిగించింది. అసలే వర్షం కారణంగా 20 ఓవర్ల మ్యాచ్‌ను 12 ఓవర్లకు కుదించారు. ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌లో అబ్బీ లెక్కీ బ్యాక్‌వార్డ్ పాయింట్ దిశగా షాట్‌ ఆడింది. ఫీల్డర్‌ బంతిని అందుకొని వికెట్ కీపర్‌వైపు విసరగా.. బంతిని అందుకున్న కీపర్ సునాయసంగా రనౌట్ చేసే అవకాశాన్ని చేజార్చింది.

వికెట్లను తాకుకుండా దూరంగా వెళ్లిన బంతిని మైదానంలోకి దూసుకొచ్చి బుజ్జి కుక్క అందుకొని పరుగులు పెట్టించింది. బంతి కోసం ఫీల్డర్లంతా దాని వెనుక పరుగెత్తారు. ఇక కుక్క యాజమాని కూడా మైదానంలోకి వచ్చి ఆటగాళ్లతో కలిసి మైదానంలో పరుగెత్తాడు. చివరకు అలసిపోయిన శునక రాజు.. నాన్‌స్ట్రైకర్ బ్యాట్స్‌మన్ వద్దకు వెళ్లి బంతిని వదిలేసింది. దాంతో మ్యాచ్ తిరిగి మొద‌లైంది.

ఇందుకు సంబంధించిన వీడియోను క్రిక్ ట్రాకర్.. ఫీల్డింగ్ కోచ్ అవసరం అనే క్యాప్షన్‌తో ట్వీట్ చేయగా వైరల్ మారింది. ఈ వీడియోను చూసి ప్రతీ ఒక్కరు నవ్వకుండా ఉండలేకపోతున్నారు. ఆ స‌మ‌యంలో కామెంటేట‌ర్స్ కూడా బిగ్గ‌ర‌గా న‌వ్వేశారు. ఐర్లాండ్ క్రికెట్ టీమ్ విషయానికి వస్తే.. జింబాబ్వేతో ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. టీ20 సిరీస్‌ను ఐర్లాండ్ కైవసం చేసుకోగా.. వన్డే సిరీస్‌ డిసైడర్ మ్యాచ్ సెప్టెంబర్ 13న జరగనుంది.