వివాదంలో ఇరుక్కున్న అన్నమయ్య హీరోయిన్.. మండిప‌డుతున్న డీఎంకే నేత‌లు

కొందరు హీరోయిన్లు సినిమాల కంటే కూడా వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్ అవుతుంటారు. అలాంటి హీరోయిన్ కస్తూరి. తెలుగులో నాగార్జున హీరోగా వచ్చిన అన్నమయ్య సినిమాలో రమ్యకృష్ణ తో పాటు మరో హీరోయిన్ గా నటించింది కస్తూరి. దాంతో పాటు మరిన్ని తెలుగు సినిమాలు కూడా చేసింది. అయితే ఎక్కువగా తమిళ సినిమాలతో గుర్తింపు సంపాదించుకుంది కస్తూరి. ప్రస్తుతం మా టీవీలో వస్తున్న గృహలక్ష్మి సీరియల్ లో లీడ్ క్యారెక్టర్ చేస్తోంది. కానీ ఈమె ఎప్పుడూ సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటుంది.

మరోసారి ఈమె విషయంలో ఇదే జరిగింది. తాజాగా తమిళ నటుడు, నిర్మాత వెంకట్‌ సుభా కరోనా వైరస్ తో కన్నుమూసాడు. ఈయన మృతికి సంతాపం తెలుపుతూ నటి కస్తూరి శంకర్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. ఈ మధ్యే కరోనా బారిన పడిన వెంకట్ చెన్నైలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మే 29 తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన మృతిపై తమిళ సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పించారు. ఇందులో నటి కస్తూరి కూడా ఉన్నారు.

ఆయనకు సంతాపం తెలుపుతూ ఈమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది. ‘వెంకట్ సర్ ఇది నమ్మశక్యంగా లేదు.. కొద్ది రోజుల కిందటే ఆయన ఉదయనిధి సినిమా షూటింగ్ నుంచి వచ్చారు.. ఆ మరుసటి రోజే ఆయనకు జ్వరం వచ్చింది.. టెస్ట్ చేయించుకుంటే నెగిటివ్ అని వచ్చింది.. కొన్ని రోజులకు మళ్లీ అనారోగ్యం పాలయ్యారు.. ఇప్పుడు ఆయన చనిపోయారు.. ఆయనింకా వ్యాక్సిన్ కూడా తీసుకోలేదు. సారీ సుభాగారు..’ అంటూ ఆమె సంతాపం వ్యక్తం చేశారు. అది చూసిన డీఏంకే కార్యకర్తలు, ఫాలోవర్స్‌, ఎమ్మెల్యే ఉదయనిది స్టాలిన్ అభిమానులు ఆమెపై మండిపడుతున్నారు. ఇదంతా డీఏంకే వల్ల అయిందంటావా..? వ్యాక్సిన్ వేసుకోకపోవడం వల్లే మరణించారంటావా..? అంటూ కస్తూరిపై విరుచుకుపడుతున్నారు. దీనిపై ఇప్పటివరకు కస్తూరి రిప్లై ఇవ్వలేదు.