Theaters Reopen: థియేటర్స్ విషయంలో మళ్లీ నిరాశే.. ఒక్కరూ తెరవలేదుగా..!

Theaters Reopen: జులై 18 నుంచి థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి అంటూ సోషల్ మీడియాలో చాలా హంగామా జరిగింది. దాంతో సినిమా లవర్స్ కూడా బాగానే సిద్ధమయ్యారు. హమ్మయ్యా.. ఇన్నాళ్ళకు థియేటర్స్ తెరుచుకుంటున్నాయి అంటూ నిర్మాతలు కూడా సంతోషపడ్డారు. అయితే మరోసారి వీళ్ళకు నిరాశే ఎదురైంది. జులై 18న థియేటర్స్ ఎక్కడా తెరుచుకోలేదు. కేవలం మాటల వరకే అది సరిపోయింది. చేతల్లో ఎక్కడా తెరవలేదు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసానిని ఎగ్జిబిటర్లు కలిసారు. వాళ్ల డిమాండ్లతో వినతి పత్రం అందించారు. అందులో వాళ్లు కోరుకున్న డిమాండ్స్ వెంటనే ప్రభుత్వం అనుమతించాలంటూ కోరారు. దానికి మంత్రి నుంచి కూడా స్పందన బాగానే ఉండటంతో తెరవడానికి ఓకే చెప్పారని ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేం జరగలేదు.


ఇప్పటికే రద్దయిన పార్కింగ్ ఫీజును వెంటనే పునరుద్ధరించాలని వాళ్లు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై పాత జీవోని రద్దు చేయాలని.. కరెంటు బిల్లుల రద్దు చేయాలని మంత్రిని కోరారు తెలంగాణ ఎగ్జిబిటర్లు. దాంతో పాటు టికెట్ల రేట్ల పెంపు.. అదనపు షోలకు అనుమతులు.. ఆస్తి పన్ను రద్దు.. జీఎస్టీ తగ్గింపు .. ఇలా రకరకాల డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చారు. వీటన్నిటికీ అనుమతిస్తేనే థియేటర్లు తెరుస్తారు. లేదంటే ఈ రంగం అలా ఖాళీగానే ఉంటుందని సంకేతాలు అందించారు. దీనిపై ఇటు తెలంగాణ.. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తున్నాం అన్నట్లుగానే ముందడుగు వేసాయి. దాంతో ఎగ్జిబిటర్లు తెరవడానికి ఓకే అన్నారు. కానీ అక్కడ అనుకున్నది జరగలేదు. గత ఏడాదిన్నర కాలంగా థియేటర్ వ్యవస్థతో కరోనా వైరస్ దాగుడు మూతలు ఆడుతుంది. ఏడు నెలలకు పైగానే థియేటర్స్ పూర్తిగా క్లోజ్ చేసారు.

ఆ సమయంలో ఎంతోమంది థియేటర్ యాజమాన్యం రోడ్డున పడ్డారు. కొన్ని వందల థియేటర్స్ కళ్యాణ మంటపాలుగా మారిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 200 థియేటర్స్ శాశ్వతంగా మూసేసారు. అలాంటి సమయంలో జనవరి నుంచి ఎప్రిల్ రెండో వారం వరకు థియేటర్స్ బాగానే ఓపెన్ అయ్యాయి. అలాటి సమయంలోనే సెకండ్ వేవ్ ఎవరూ ఊహించని స్థాయిలో ఇండియాపై కన్నెర్ర జేసింది. దాంతో అప్పుడప్పుడే గాడిన పడుతున్న థియేటర్స్ వ్యవస్థపై మరోసారి కోలుకోలేని దెబ్బ పడిపోయింది. కొన్ని రోజులుగా కరోనా కేసులు భారీగానే తగ్గుతున్నాయి. దాంతో థియేటర్స్ తెరుచుకోడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కూడా ఇచ్చాయి. అయితే అనుమతులు వచ్చినా కూడా తెరవడానికి మాత్రం ఒప్పుకోవడం లేదు. థియేటర్స్ ఓపెన్ చేయడం వరకు ఓకే కానీ సినిమాలు విడుదల చేస్తారా అనేది అసలు సమస్య. నిర్మాతలు ఇప్పటికీ ఓటిటి వైపు అడుగులు వేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో థియేటర్స్ తెరిచినా ఆ ప్రభావం ఎంతవరకు ఉంటుందో చూడాలి.