Harish Shankar: చాలా నెలలుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా తెరకెక్కించే విషయమై ఎదురు చూపులే మిగులుతున్నాయి టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్‌కి. హరీష్ శంకర్ అంటే పవన్ కళ్యాణ్ వీరాభిమాని మాత్రమే కాదు.. అరివీర భయంకరమైన భక్తుడు కూడా.. అంటారు పవన్ అభిమానులు.

గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా ‘గబ్బర్ సింగ్’ తీసిన దర్శకుడు హరీష్ శంకర్. ఈసారి అంతకు మించి.. అంటూ, ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ కూడా ఖరారు చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించాల్సి వుంది.
పవన్ కళ్యాణ్‌ని కాదని…
అయితే, పవన్ కళ్యాణ్ తన రాజకీయ కమిట్మెంట్స్ సహా, కొన్ని అనివార్య కారణాలతో.. రకరకాల ప్రాజెక్టులతో బిజీగా వున్నారు. అందులో ‘వినోదయ సితం’ కూడా ఒకటి. దాంతో, హరీష్ శంకర్ సినిమా క్రమంగా వెనక్కి వెళ్ళిపోతోంది. ఈ నేపథ్యంలో, హరీష్ శంకర్ ‘భవదీయుడు భగత్‌సింగ్’ కంటే ముందు ఇంకో సినిమా చేసెయ్యాలనే ఆలోచనతో వున్నాడనే ప్రచారం తెరపైకొచ్చింది.
పవన్ కళ్యాణ్‌తో తాడో పేడో తేల్చుకోనున్న హరీష్.. అంటూ ఆ మధ్య ప్రచారం జరిగితే, అదంతా ఉత్తదేనని తనదైన స్టయిల్లో ఖండించేశాడు హరీష్ శంకర్. మరిప్పుడు, రామ్ పోతినేని హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా.. అంటూ జరుగుతోన్న ప్రచారంపై ఏమంటాడో.!
రామ్ పోతినేని ప్రస్తుతం ‘ది వారియర్’ సినిమా పనుల్లో బిజీగా వున్నాడు. ఆ తర్వాత రామ్, బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. మరి, హరీష్ శంకర్‌తో రామ్ చేసే సినిమా ఎప్పుడో.! ఆ కథేమిటో.!