Dhookudu Special Show: దూకుడు స్పెష‌ల్ షో.. వ‌చ్చిన మొత్తాన్ని సిబ్బందికి విరాళంగా ఇచ్చిన ఫ్యాన్స్‌

Dhookudu Special Show: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు- స్టార్ డైరెక్ట‌ర్ శ్రీను వైట్ల కాంబినేష‌న్‌లో రూపొందిన దూకుడు చిత్రం ఎంత సెన్సేష‌న్స్ క్రియేట్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సెప్టెంబర్ 23, 2011న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీని సృష్టించి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టిన “దూకుడు” దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా సూపర్ స్టార్ అభిమానులు #DecadeForIHDookudu అనే హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ “దూకుడు” విజయాన్ని, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

Dhookudu Special Show Money Donated by Mahesh Babu Fans
Dhookudu Special Show Money Donated by Mahesh Babu Fans

మహేష్ బాబు క్రేజ్ దృష్ట్యా రెండు తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రదేశాలలో “దూకుడు” స్పెషల్ షోలను ప్రదర్శించారు. బెంగుళూరులో కూడా ప్రత్యేక షోను ప్లాన్ చేశారు. ఈ ప్రత్యేక షోలకు సూపర్ స్టార్ అభిమానుల నుంచి విశేష స్పందన ల‌భించింది. చాలా చోట్ల ఆన్‌లైన్‌లో టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. కొద్ది క్షణాల్లోనే థియేటర్లు హౌస్ ఫుల్స్‌ గా మారాయి.

దూకుడు స్పెష‌ల్ షోకి వ‌చ్చిన మొత్తాన్ని మ‌హేష్ ఫ్యాన్స్ సుద‌ర్శ‌న్ 35 ఎంఎం స్టాఫ్‌కి విరాళంగా ఇచ్చారు. మ‌హేష్ అభిమానులు చూపించిన ఈ చొర‌వ‌పై ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. గ‌తంలోను మ‌హేష్ అభిమానులు ఇలాంటి ఎన్నో మంచి ప‌నులు చేసి అంద‌రి ప్ర‌శంస‌లు పొందిన విష‌యం తెలిసిందే.

దాదాపు ఐదు సంవత్సరాలు తమ హీరో భారీ విజయం కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ కు ‘దూకుడు’ మహదానందం పంచింది. ఈ చిత్రంతో మహేశ్ బాబు, దర్శకుడు శ్రీను వైట్ల తొలిసారి కలసి పనిచేశారు. ఈ సినిమాలోనే మహేశ్ తో సమంత మొదటి సారి జోడీ కట్టి అలరించింది. ఇలా పలు విశేషాలకు వేదికగా నిలచింది ‘దూకుడు’. ఈ చిత్రానికి ముందు మహేశ్ బాబు బ్లాక్ బస్టర్ ‘పోకిరి’ 2006లో పలు రికార్డులు నెలకొల్పింది.

మహేశ్ నటించిన “సైనికుడు, అతిథి” ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయాయి. మహేశ్ మళ్ళీ బిగ్ స్క్రీన్ పై కనిపించడానికి రెండేళ్ళు గ్యాప్ తీసుకున్నారు. 2008, 2009లో మహేశ్ హీరోగా నటించిన సినిమాలేవీ విడుదల కాలేదు. ఆ సమయంలో ఆయన యాడ్స్ లో బిజీగా ఉన్నారు. అభిమానులు మాత్రం తమ హీరో సినిమాల్లో అలరించాలని ఆశించారు. ఈ నేపథ్యంలో 2011 సెప్టెంబర్ 23న విడుదలయిన ‘దూకుడు’ బాక్సాఫీస్ వద్ద కూడా దూసుకు పోయింది.