Dhee Choreographer Chaitanya : పేరు, సత్కారాలు నా కష్టాలు తీర్చలేకపోతున్నాయి … కొరియోగ్రాఫర్ చైతన్య
NQ Staff - May 1, 2023 / 01:35 PM IST
Dhee Choreographer Chaitanya : పేరు, సత్కారాలు నా కష్టాలు తీర్చలేకపోతున్నాయి అందుకే ఈ లైఫ్‌కి గుడ్ బై ప్రముఖ యువ కొరియోగ్రాఫర్ చావా చైతన్య శనివారం నెల్లూరులో ఆత్మహత్య చేసుకొన్నాడు.
నెల్లూరులో లింగసముద్రం మండలంలోని ముట్టావారిపాలెనికి చెందిన సుబ్బారావు, లక్ష్మీరాజ్యం దంపతుల ఏకైక కుమారుడు చైతన్య. గత నాలుగున్నరేళ్ళుగా వివిద టీవీ ఛానల్స్‌లో డ్యాన్స్ షోలకు కొరియోగ్రాఫర్‌గా చేస్తున్నాడు. ముఖ్యంగా జబర్దస్త్, ఢీ డ్యాన్స్ షోలతో చైతన్య చాలా మంచి పేరు సంపాదించుకొన్నాడు. టీవీ షోలతో బిజీగా మారడంతో చైతన్య, చెల్లి, తల్లితండ్రులతో కలిసి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యారు.
రెండు రోజుల క్రితమే అంటే శనివారమే నెల్లూరులో కళాంజలి ఆర్కెస్ట్రా అండ్ ఈవెంట్స్ సంస్థ చైతన్యకు ఘనంగా సన్మానం చేసింది. ఆ కార్యక్రమంలో ముగిసిన తర్వాత చైతన్య అక్కడి నుంచి నెల్లూరు క్లబ్ హోటల్‌లోని తన గదికి వెళ్ళి సెల్ఫీ వీడియో తీసుకొని తన మనసులో బాధను చెప్పుకొని ఫ్యానుకి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు!
సెల్ఫీ వీడియోలో తన తల్లితండ్రులు, చెల్లికి, స్నేహితులు, డాన్స్ గ్రూపులలో స్నేహితులు అందరికీ చైతన్య పేరుపేరునా క్షమాపణలు చెప్పుకొన్నాడు. అందరూ తనకు ఎంతో తోడ్పాటు అందించినప్పటికీ అందరి నమ్మకాన్ని వమ్ము చేసినందుకు క్షమాపణలు చెప్పుకొన్నాడు. జబర్దస్త్ షోతో పేరు, డబ్బు రెండూ సంపాదించుకోగలిగాను కానీ ఢీషోతో కేవలం పేరు, ప్రతిష్టలు మాత్రమే వచ్చాయని చైతన్య సెల్ఫీ వీడియోలో చెప్పుకొని బాధపడ్డాడు.
కొరియోగ్రాఫర్‌గా మంచి పేరు సంపాదించుకోగలిగినా తగిన ఆదాయం లేకపోవడంతో అప్పులు మీద అప్పులు చేస్తూ సరిదిద్దుకోలేనన్ని తప్పులు చేస్తూ పూర్తిగా మునిగిపోయానని చైతన్య చెప్పుకొని బాధపడ్డాడు.
ఈ అప్పుల ఊబిలో నుంచి ఎన్నటికీ బయటపడలేనని, తనమీద ఎన్నో ఆశలు, ఎంతో నమ్మకం పెట్టుకొన్న తల్లితండ్రులకు, చెల్లికి ఏమీ చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటి జీవితం ఇంకా కొనసాగించలేనని అందుకే దీనికి ముగింపు పలుకుతున్నానని చెప్పి చైతన్య ఆత్మహత్య చేసుకొన్నాడు.
చైతన్య స్నేహితులు ఆ వీడియోని చూసి అతని తల్లితండ్రులకు తెలియజేశారు. హోటల్ సిబ్బంది సమాచారం అందుకొన్న దర్గామిట్ట ఇన్‌స్పెక్టర్ సిహెచ్. సీతారామయ్య, ఎస్సై విజయ్ కుమార్ పోలీసులతో అక్కడికి చేరుకొని హోటల్ గది తలుపులు పగులగొట్టి చైతన్య మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని చైతన్యను ఎవరైనా వేధించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
చైతన్య వయసు కేవలం 32 ఏళ్ళే. ఇంత చిన్న వయసులోనే ఇంత గుర్తింపు, పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడం సామాన్యమైన విషయం కాదు. అంటే చైతన్యకి ఎంతో ఉజ్వలమైన భవిష్యత్ ఉందని అర్దమవుతూనే ఉంది. అయితే సినీ, టీవీ ఇండస్ట్రీలో చాలా మంది చేసే తప్పే బహుశః చైతన్య కూడా చేసిన్నట్లు కనిపిస్తోంది.
ఓ స్థాయికి ఎదిగేవరకు ఓపిక పట్టడం చాలా అవసరం. కానీ తొందరపడి ఓ కోయిల ముందే కూసిందన్నట్లు… జీవితంలో ఇంకా సెటిల్ కాకమునుపే చైతన్య కుటుంబాన్ని సుఖపెట్టాలనో లేదా సమాజంలో ఉన్నతంగా జీవించాలనో లేదా డ్యాన్స్ షోల నిర్వహణ ఖర్చుల కోసమో అప్పులు ఊబిలో దిగి ఉండవచ్చు. చివరికి ఆ ఊబిలోనే కూరుకుపోయిన్నట్లు తనే చెప్పుకొన్నాడు. అప్పు మీద అప్పు… తప్పు మీద తప్పు చేసుకొంటూ ముందుకుసాగి చివరికి వెనుదిరగలేని పరిస్థితికి చేరుకొన్నానని చైతన్య చెప్పుకోవడం గమనించినప్పుడు, ఈ ఇండస్ట్రీలోకి లేదా ఏ రంగంలో ఉన్నవారైనా ఏమి చేయకూడదో, చేస్తే ఏమవుతుందో చైతన్య తన జీవితంతో చెప్పిన్నట్లు భావించవచ్చు.
ఒకప్పుడు అంటే 4-5 దశాబ్ధాల క్రితం ఇన్ని అవకాశాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు యువతకు ఏ రంగంలో నైపుణ్యం ఉన్నా దానిలో అపారమైన అవకాశాలున్నాయి. ఇందుకూ… చైతన్య జీవితమే ఓ నిదర్శనం. కనుక జీవితాన్ని నిర్మించుకొనే క్రమంలో తొందరపాటు పనికిరాదని అర్దం అవుతోంది. జీవితంలో ఏదీ తేలికగా లభించదు. లభించిన దాని విలువ చాలా మంది గుర్తించరు.
గుర్తించినవారు పైకి ఎదుగుతారు. మరికొందరు తొందరపాటుతో తప్పులు చేసుకొని ఈవిదంగా జీవితం అర్దాంతరంగా ముగించుకొని కన్నవారికి తీరని శోకం మిగిల్చి వెళ్లిపోతారు. అదే… ఈ సమస్యల నుండి బయటపడేందుకు ఇంకేమైనా మార్గాలున్నాయా అని చైతన్య తన తల్లితండ్రులతో శ్రేయోభిలాషులతో మాట్లాడి ఉంటే ఏదో పరిష్కారం లభించి ఉండేదేమో కదా?