Devi Sri Prasad: శ్రావ‌ణికి ఛాన్స్ ఇచ్చిన దేవి శ్రీ.. ప్ర‌శంసించిన కేటీఆర్

Devi Sri Prasad: తెలంగాణ‌లో టాలెంట్ ఉన్న గాయ‌నీ గాయ‌కులు ఎంద‌రో ఉన్నారు. వారి ప్ర‌తిభ బ‌య‌ట‌కి రావ‌డం లేదు. ఇటీవ‌ల మెదక్ జిల్లా నారైంగి గ్రామానికి చెందిన శ్రావణి అనే ఓ అమ్మాయి రేలా రే రేలా రే అనే తెలంగాణ పాటను పాడగా.. శ్రావణి పాడిన వీడియోను సురేంద్ర తిప్పరాజు అనే వ్యక్తి తన ట్విట్టర్ వేదికగా తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పంచుకున్నాడు.

Devi Sri Prasad Gave Chance to VIllage Singer Shravani1
Devi Sri Prasad Gave Chance to VIllage Singer Shravani1

మెదక్ జిల్లాలోని నారైంగి గ్రామంలో ఓ ఆణిముత్యం దొరికిందని, శ్రావణి అనే అమ్మాయి బ్రిలియంట్ సింగర్ అంటూ.. ఆ గాయని స్వరం మైమరిపించేలా ఉంది, ఆమె టాలెంట్ కు మీ సహకారంతో పాటు మీ ఆశీస్సులు అవసరమని ట్వీట్ చేశాడు. కేటీఆర్ కూడా ఆ అమ్మాయి టాలెంట్‌కు ఫిదా అయ్యాడు.

త‌న ట్విట్ట‌ర్‌లో వీడియోని షేర్ చేస్తూ.. అమ్మాయికి అద్భుతమైన టాలెంట్ ఉందంటూ ప్రశంసించాడు. అంతేకాకుండా కేటీఆర్ ఈ వీడియోను మ్యూజిక్ డైరెక్టర్లు తమన్, దేవి శ్రీ ప్రసాద్ లకు ట్యాగ్ చేయగా.. శ్రావణి అద్భుతమైన సింగర్ అని తమన్ స్పందించాడు.దేవిశ్రీ ప్రసాద్ శ్రావణి స్వరానికి ఫిదా అయ్యానని తెలిపాడు. ఇంతటి గొప్ప సింగర్ ని తమ దృష్టికి తీసుకు వచ్చినందుకు కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

భవిష్యత్తులో నిర్వహించే షోలలో కూడా శ్రావణికి తప్పకుండా అవకాశం ఇస్తామని దేవి శ్రీ ప్రసాద్ తన ట్విట్టర్ వేదికగా తెలప‌గా, ఆ మాట నిల‌బెట్టుకున్నాడు దేవి శ్రీ. స్టార్ టూ రాక్ స్టార్ కార్య‌క్రమంలో అవ‌కాశాన్ని ఇచ్చిన దేవి శ్రీ, ఇదే విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు.

కేటీఆర్ సర్… ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. మెదక్ జిల్లాకు చెందిన ఆ ప్రతిభావంతురాలైన గాయని శ్రావణిని గుర్తించాం. ఆమెను విమానంలో చెన్నై తీసుకెళ్లాం. ‘స్టార్ టు రాక్ స్టార్’ కార్యక్రమంలో ఆమె ‘లైమ్ లైట్’ రౌండ్ లో పాల్గొంది. నిజంగానే ఆమె ఊపేసింది. ఈ ఎపిసోడ్ జీ తమిళ్ చానల్లో జులై 18 ఆదివారం నాడు రాత్రి 7.30 గంటలకు ప్రసారం అవుతుంది” అని వివరించారు.

దీనిపై మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. “మీ స్పందన అమోఘం బ్రదర్” అంటూ దేవిశ్రీ ప్రసాద్ కు కితాబునిచ్చారు. అందుకు దేవి ప్రతిస్పందిస్తూ వినమ్రంగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ‘కేటీఆర్ సర్… మీరు ఎంతో బిజీగా ఉంటూ కూడా ఇలాంటి ప్రతిభావంతులను గుర్తిస్తూ ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తుండడం అబినందనీయం’ అని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం దేవి శ్రీ ప్ర‌సాద్, కేటీఆర్‌పై ప్ర‌శంస‌ల వర్షం కురుస్తుంది.