David Warner: రామ్ చ‌రణ్‌.. డేవిడ్ వార్న‌ర్‌లా మారాడేంటి ?

David Warner: ఆస్ట్రేలియా విధ్వంస‌క‌ర బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్న‌ర్ ఇటీవ‌లి కాలంలో ట్రెండ్ సెట్ట‌ర్‌గా మారాడు. లాక్‌డౌన్ వ‌ల‌న క్రికెట్ లేక‌పోవ‌డంతో ఇంటికే ప‌రిమిత‌మైన వార్న‌ర్ త‌న భార్య‌, పిల్ల‌ల‌తో క‌లిసి ప‌లు వీడియోలు చేశాడు. ఇవి నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ముఖ్యంగా సౌత్ సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన పాట‌ల‌కు ప‌లు వీడియోలు చేసి నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో అల‌రించారు. తెలుగు పాటలకు స్టెప్పులేస్తూ.. డైలాగ్‌లు చెబుతూ.. స్పూఫ్ వీడియోలతో సోషల్ మీడియా వేదికగా అభిమానులను ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేశారు.

David Warner imitates Ram Charan in VVR Movie
David Warner imitates Ram Charan in VVR Movie

మ‌న తెలుగు హీరోల క‌న్నా వార్న‌ర్‌కి టాలీవుడ్‌లో ఎక్కువ క్రేజ్ వ‌చ్చింది. ఇటీవ‌ల వార్న‌ర్ భారతదేశం తనకి రెండో ఇల్లుగా చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా.. అన్నింటికంటే తనకి నచ్చే ప్రదేశం హైదరాబాద్ అని స్పష్టం చేశాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌తో తన అనుబంధాన్ని చాటుతూ కొన్ని ఫొటోల్ని కూడా వార్నర్ షేర్ చేశాడు. అయితే టిక్ టాక్ బ్యాన్ అయిన‌ప్ప‌టి నుండి వార్న‌ర్ మార్ఫింగ్ వీడియోలు ఎక్కువ‌గా షేర్ చేస్తున్నాడు.

రీసెంట్‌గా భారీ బడ్జెట్​ ‘ఆర్​ఆర్ఆర్​’ మూవీ పోస్ట్‌ర్‌ను మార్ఫ్ చేశాడు. ఎన్టీఆర్ బైక్ నడుపుతుండగా.. రామ్​ చరణ్​ వెనక కూర్చొని ఉన్న పోస్ట‌ర్‌ని ఆర్ఆర్ఆర్ టీం విడుద‌ల చేయ‌గా, ఈ పోస్టర్​లో ఎన్టీఆర్​ స్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్​ను, రామ్​ చరణ్ స్థానంలో తన ఫొటోను పెట్టి వార్నర్ మార్ఫింగ్ చేశాడు. ఈ పోస్ట్‌కు క్షణాల్లో వేల సంఖ్యలో లైకులు వచ్చిపడ్డాయి. సన్‌రైజర్స్ అభిమానులైతే కామెంట్లతో ప్రశంసల వర్షం కురిపించారు.

David Warner imitates Ram Charan in VVR Movie
David Warner imitates Ram Charan in VVR Movie

ఇక తాజాగా రామ్ చ‌ర‌ణ్ తేజ్‌ని అనుక‌రించాడు. విన‌య విధేయ రామ సినిమాలోని ఫైటింగ్ వీడియో క్లిప్పింగ్‌లో చ‌ర‌ణ్ ఫేస్ ప్లేస్‌లో త‌న ముఖాన్ని జోడించి అద‌ర‌గొట్టాడు. చెర్రీలోకి వార్న‌ర్ దూరిన‌ట్టు ఈ వీడియో క‌నిపిస్తుంది. ఈ వీడియోకి లైకులు, కామెంట్ల వ‌ర్షం కురుస్తుంది. కాగా, వార్నర్ ఇప్ప‌టికే ప్ర‌భాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్‌కి సంబంధించిన వీడియోలు చేయ‌గా ఇందులో వార్న‌ర్ న‌ట కౌశ‌లం అంద‌రికి న‌చ్చింది.

ఐపీఎల్ 2021 సీజన్‌లో డేవిడ్ వార్నర్‌కి ఊహించని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. సీజన్ వాయిదాపడే సమయానికి 29 మ్యాచ్‌లు ముగియగా.. హైదరాబాద్ ఏడు మ్యాచ్‌లాడింది. కానీ.. వార్నర్ మాత్రం ఆరు మ్యాచ్‌‌లే ఆడి 193 పరుగులు చేశాడు. సీజన్ వాయిదాకి ముందు వార్నర్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించిన హైదరాబాద్ ఫ్రాంఛైజీ కేన్ విలియమ్సన్‌కి బాధ్యతలు అప్పగించింది. హైదరాబాద్‌కి వార్నర్ ఆడటం ఇదే చివరి సీజన్ అని మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు.