CORONA: ఆగ‌ని మ‌ర‌ణ మృదంగం.. ప్ర‌ముఖుల మ‌ర‌ణాల‌తో దిగ్భ్రాంతి చెందుతున్న అభిమానులు

కన్నీరు ఆగకుండా చేస్తుంది కరోనా మహమ్మారి. దీని ధాటికి ప్రముఖులు కూడా ఒక్కొక్కరుగా దూరం అయిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులు కరోనా ధాటికి ప్రాణాలు కోల్పోయారు. మరీ ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీపై అయితే కన్నెర్రజేసింది కరోనా. అక్కడ వరసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న ప్రముఖ దర్శకుడు కేవీ ఆనంద్ కూడా ఇలాగే చనిపోయారు. ఇప్పుడు కొన్ని గంటల వ్యవధిలో ఇద్దరు ప్రముఖులు కన్నుమూసారు. కరోనా మహమ్మారి ఈ రెండు తమిళ సినీ కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ధనుష్ పుదు పెట్టై సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు నితీష్ వీర కేవలం 45 ఏళ్ళ వయసులోనే మరణించాడు. కరోనా మహమ్మారి ఈ నటుడిని కెరీర్ లో మంచి స్టేజీలో ఉన్నపుడు మింగేసింది.

రజినీకాంత్ తో కాలా సినిమాలో నటించాడు ఈయన. అలాగే ధనుష్ హీరోగా నటించిన అసురన్‌ సినిమాతో నితీష్ వీర దశ మారిపోయింది. అక్కడ్నుంచి వరస సినిమాలు చేస్తున్నాడు. కెరీర్ లో ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్న తరుణంలోనే కరోనా కాటుకు బలైపోయాడు. ఈయన మరణవార్త తెలిసిన కొన్ని గంటల్లోనే మరో ఇంట్లో కూడా విషాదం చోటు చేసుకుంది. నటుడు, గాయకుడు, దర్శకుడు అరుణ్ రాజా కుటుంబంలోనూ కరోనా తీవ్ర విషాదం నింపింది. అతడి భార్య ఇందూజ ఈ వైరస్‌కు బలైంది. రాజా రాణి సినిమాలో ఆర్య స్నేహితుడిగా, నీగ్రో పాత్రలో నటించిన నటుడు గుర్తున్నాడా.. అతడే అరుణ్ రాజా. ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు దర్శకుడు కూడా.

తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేష్ ప్రధాన పాత్రలో వచ్చిన కణా సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తెలుగులో కౌసల్య కృష్ణమూర్తిగా రీమేక్ అయింది ఈ సినిమా. ఈ మధ్యే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు, ఎమ్మెల్యే ఉదయనిధి హీరోగా హిందీ హిట్ సినిమా ఆర్టికల్ 15 రీమేక్‌ను తమిళంలో కొన్ని రోజుల కింద మొదలు పెట్టాడు అరుణ్. ఇలాంటి సమయంలో ఆయన భార్య చనిపోవడం విషాదం. ఏదేమైనా ఈ రెండు కుటుంబాల్లోనూ కరోనా కనికరం లేని దాడి చేసింది.