Sunny and Kajal : న‌న్ను త‌ప్పుగా అర్ధం చేసుకున్నారు…హౌజ్‌లో జ‌రిగిన అంశాల‌పై స్పందించిన సుద‌ర్శ‌న్

Sunny and Kajal : రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అనుభవించు రాజా’. ఇందులో సుదర్శన్ కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం బిగ్‌బాస్‌ షోలో చిత్ర బృందం సందడి చేసింది. రాజ్‌తరుణ్‌, కథానాయిక కషికాఖాన్‌, నటుడు సుదర్శన్‌ బిగ్‌బాస్‌కు వచ్చి హౌస్‌మేట్స్‌తో మాట్లాడారు. హౌస్‌లో ఎవరెలా ఉంటారన్న దానిపై పంచ్‌లు వేశారు.

ఈ సందర్భంగా వీజే సన్నీ, ఆర్జే కాజల్‌ గురించి సుదర్శన్‌ చేసిన వ్యాఖ్యలు వివాదమయ్యాయి. కాజల్‌ గురించి చెప్పమని సుదర్శన్‌ను నాగార్జున అనగా ‘కాజల్‌ చాలా బాగా ఆడుతున్నారు. మీరు అలిగినప్పుడు సన్నీ వచ్చి ఓదార్చడం అదో టైపు రొమాన్స్‌ బాగుంది’ అనడంతో సన్నీ, కాజల్‌ అవాక్కయ్యారు.

సన్నీ, కాజల్‌ అనుబంధం గురించి సుదర్శన్‌ చేసిన వ్యాఖ్యల పట్ల సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ‘వివాహం అయిన అమ్మాయి గురించి ఎలా మాట్లాడాలో తెలియదా’, ‘నిజంగా నువ్వు షో చూస్తున్నావా? వాళ్లిద్దరూ మంచి స్నేహితులు’ అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. దీంతో సుదర్శన్‌ స్పందించారు.

‘‘ఆదివారం జరిగిన బిగ్‌బాస్‌ షో చూసి చాలా సందేశాలు వచ్చాయి. ‘మీరిలా మాట్లాడితే వాళ్లు ఎలా ఆడతారు’ అంటూ వరుసగా మెస్సేజ్‌లు చేస్తున్నారు. బ్రదర్‌.. మేము సరదాగా చాలా సేపు మాట్లాడుకున్నాం. కానీ, ఎడిటింగ్‌లో మొత్తం పోయి, ఐదు నిమిషాలే వచ్చింది. వీడియో చూడటం వల్ల అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు.

సన్నీ-కాజల్‌ రిలేషన్‌ గురించి తండ్రీ-కూతుళ్ల నుంచి సిస్టర్‌ బ్రదర్‌ వరకూ సాగింది. మేమంతా కామెడీగా మాట్లాడుకున్నాం తప్ప వేరే ఉద్దేశం లేదు. కానీ, బయటకు వచ్చిన వీడియో వల్ల నెగెటివ్‌గా అనుకుంటున్నారు. నా తరపున సన్నీని అభిమానించే వాళ్లకు, కాజల్‌, ఆమె కుటుంబ సభ్యులకు క్షమాపణ చెబుతున్నా’’ అని అన్నారు.