Comedian Pruthvi: మా యుద్ధంలో విష్ణుకి అండ‌గా ఉంటాను.. క‌మెడీయ‌న్ పృథ్వీ సంచ‌ల‌న కామెంట్స్

Comedian Pruthvi: అక్టోబ‌ర్ 10న జ‌ర‌గ‌నున్న మా ఎన్నిక‌ల‌కి సంబంధించి జోరుగా స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఈ సారి మంచు విష్ణు, ప్ర‌కాశ్ రాజ్‌ల మ‌ధ్య గ‌ట్టి పోటీ ఉంటుంద‌ని అర్ధ‌మ‌వుతుంది. ఇప్ప‌టికే ప్ర‌కాశ్ రాజ్ త‌న వ్యూహాల‌తో ముందుకు వెళుతుండ‌గా, మంచు విష్ణు కూడా ఓట‌ర్స్‌ని ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే త‌న మ‌ద్ద‌తు మంచు విష్ణుకే అని చెప్పి పృథ్వీ ఒక వీడియో విడుద‌ల చేశారు.

Comedian Pruthvi Supports Vishnu in MAA Elections
Comedian Pruthvi Supports Vishnu in MAA Elections

ఇన్ని రోజులు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల విషయమై ఇప్పటి వరకు కన్ఫ్యూజన్‌లో ఉన్న తనకు.. ఇప్పుడే క్లారిటీ వచ్చిందని తెలుపుతూ, వీడియ‌లో త‌న నిర్ణ‌యం తెలియ‌జేశాడు. మా ఎన్నిక‌ల తేది ఫిక్స్ అయింది. ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొంది. సహజంగా పోటీ ఇద్దరి మధ్య ఉంటుంది. ఒక ప్యానెల్‌కి ప్రకాశ్ రాజ్‌గారు, మరో ప్యానెల్‌కు మంచు విష్ణు. వీరిద్దరూ పోటీ చేస్తున్నారు.


మొన్నటి వరకు అనేక ఊహాగానాలు వినిపించాయి. వారికి ఓటు వేయాల్సి వస్తుందా? వీరికి ఓటు వేయాల్సి వస్తుందా? అసలు ఈ ప్యానెల్ ఏంటి? అసలు ఎవరు నిలబడుతున్నారని సభ్యులందరూ గందరగోళంలో ఉన్నారు. ఇప్పటికి ఒక క్లారిటీ వచ్చింది. వచ్చిందని అనుకుంటున్నా. ఇక నా మద్దతు ఎవరికి ఇవ్వాలి అనే దానిపై చాలా రోజులుగా నేను మదనపడుతున్నాను. అటుపక్క ప్యానెల్ వారు ఏం డిసైడ్ చేస్తున్నారో తెలియదు కానీ.. అప్పుడే గొడవలు మొదలైనాయ్. ఇది నా మాట కాదు.. సభ్యుల మాట.


బయటి సభ్యులు ఏమనుకుంటున్నారంటే.. ఈ ప్యానెల్ ప్రకటించాకే ఇటువంటి గొడవలు జరుగుతున్నాయి.. రేపు ఈ కమిటీ గెలిస్తే ఏవిధంగా ఉంటుందో ప్రస్ఫుటంగా అర్థమవుతుందని అంటున్నారు. కాబట్టి ఈ వివాదాలు, గొడవలు వంటివి ఏమీ లేకుండా విష్ణు బాబు సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ అందరం ఒకటి ఆలోచించాలి. ఇప్పటి వరకు ప్రెసిడెంట్స్‌గా చేసిన అందరూ చక్కగా పరిపాలన అందించారు.


ముఖ్యంగా నరేష్ తన శక్తికి మించి వర్క్ చేశాడు. ఆయన ఒక్కడనే కాదు అందరూ చక్కగా చేసి.. ఇప్పటి వరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌‌ని అద్భుతంగా నడిపించారు. ఇప్పుడు వివాదాలతో ఉన్న కమిటీ రేపు ఏం పని చేస్తుంది? మనం ఎవరికి ఓటు వేయాలి? ఎవరిని ఎంచుకోవాలి? అని చాలా రోజులుగా నిశ్శబ్దంగా ఉండిపోయాను. ఎవరు మనకి కరెక్ట్ ప్రెసిడెంట్? అని ఆలోచించగా.. తన పని తాను చేసుకుంటూ.. తన ప్రణాళిక తాను ఏర్పరచుకుంటూ.. పెద్దల సలహాలు తీసుకుంటూ ముందుకు పోతున్న యువకుడు విష్ణుబాబు అయితే కరెక్ట్ అని అనిపించింది.


ఉపాధి, అవకాశాలు, ఆరోగ్యం, మా బిల్డింగ్, వృద్దాశ్రమం.. ఇలా అన్నింటిపై పకడ్బందీగా, ప్రణాళికా బద్దంగా మోహన్‌బాబుగారి ఆశీర్వాదంతో మంచు విష్ణు ఆలోచనలు చేస్తున్నాడు. సైలెంట్ వెపన్ లాగా తన పని తాను చేసుకుంటూ వెళుతున్నాడు. కాబట్టి నాకు అనిపించింది.. వర్క్ మైండ్‌లో ఉన్న వ్యక్తి అన్నీ చేయగలడు అని. అందుకే నా యొక్క మద్దతు విష్ణుబాబుకి అందిస్తున్నాను.


ఇది నా తొలి పలుకు. యుద్దం మొదలైంది కదా.. రేపటి నుంచి యుద్దంలో ఉన్నానని చెప్పడానికి ఇది తొలిపలుకు అన్నమాట. అద్భుతమైన విజయాలు సాధించే శక్తి, సామర్థ్యం ఉన్న యువకుడు, పారిశ్రామికవేత్త, హీరో మంచు విష్ణుని, ఆయన ప్యానెల్‌ని మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను..’’ అని పృథ్వీ అన్నారు.