Cinema : సినిమా చూపిస్తున్నారు

Cinema : సినిమావాళ్లు సినిమా చూపించకపోతే ఇంకేం చూపిస్తారు అని మాత్రం దయచేసి అడగొద్దు. ఎందుకంటే ఎంత సినిమావాళ్లయితే మాత్రం ఇంతలా ప్రచారం కోసం పాకులాడాలా అనే ఎదురుప్రశ్న వస్తుంది. అసలేంటి సమస్య? అనే కదా అనుమానం. అదే ఇప్పుడు చర్చనీయాంశం. సినిమా చూపిస్తున్నారు అనే మాటకు సిసలైన అర్థం ‘ఇబ్బంది పెడుతున్నారు’ అని. ప్రేక్షకుల, అభిమానుల, జనాల దృష్టిని ఆకర్షించటం కోసం సినిమావాళ్లు తెగ ఇబ్బందిపడిపోతున్నారు. చీమ చిటుక్కుమంటే చాలు. అదొక అప్డేట్ అట. షూటింగులకు సంబంధించిన ఫొటోలను ఉద్దేశపూర్వకంగానే రిలీజ్ చేయటం.. పైకి మాత్రం ‘లీక్’ అయిదందంటూ ఏమీ తెలియనివాళ్ల మాదిరిగా కవర్ చేసుకోవటం.. ఆ ఫొటో ఏదో బ్రహ్మపదార్థం అయినట్లు దాన్ని పట్టుకొని సోషల్ మీడియా వాళ్లు తెగ హంగామా చేయటం.. ఈమధ్య ఇదొక ప్యాషన్, ట్రెండ్ అయింది. ఎందుకిలా చేస్తున్నారని కూపీ లాగితే ‘కావాలనే’ ఈవిధంగా వ్యవహరిస్తున్నట్లు తేలింది. కేవలం ప్రచారం కోసమే ఫ్యాన్స్ మూడ్ తో ఆడుకుంటున్నారని అర్థమవుతోంది.

Cinema : movies promotions are boring
Cinema : movies promotions are boring

ఒక్కొక్కటిగా..

గతంలో సినిమాల ఆడియోలను(సినిమాలోని పాటలను) అన్నింటినీ ఒకేసారి విడుదల చేసేవారు.. క్యాసెట్ల రూపంలో. తర్వాత ఒక్కొక్క పాట చొప్పున రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజుల్లో వస్తున్న మెజారిటీ పాటల్లో పెద్దగా విషయం(సంగీతం, సాహిత్యం) ఉండట్లేదు కాబట్టి వాటిని ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తెస్తే ఒకేసారి మర్చిపోతారని సినిమావాళ్లు భయపడుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీనివల్ల తమ చిత్రానికి ప్రచారం లభించదేమోనని, అందుకే ఈ తరహాలో చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు. నిజం చెప్పాలంటే అసలు ఆ పాటల్లో దమ్ముండాలి గానీ ఒకే సారి రిలీజ్ చేసినా ఒక్కొక్కటి చొప్పున విడుదల చేసినా ఆదరణ పొందుతాయి.

క్రియేటివిటీ కోల్పోతున్న ట్రైలర్లు: Cinema

ఇటీవలి కాలంలో టైటిల్ మోషన్ పిక్చర్లు అంటూ కొత్త రకం ప్రమోషన్లు తెర పైకి వచ్చాయి. సినిమాల ట్రైలర్లు, టీజర్లు, గ్లింప్సేలు, ఫస్ట్ లుక్కులు అంటూ ఓ హడావుడి చేస్తున్నారు. అయితే.. వాటిలో క్రియేటివిటీ లోపిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఒక డైలాగ్, ఒక ఫైట్, ఒక జోకు, ఒక లవ్ సీన్, ఒక లిరిక్, ఒక డ్యాన్స్ బిట్.. ఇలా చూపించుకుంటూ పోతున్నారు. డైలాగుల్లో, పాటల్లో, డ్యాన్సుల్లో కొత్తదనం ఉంటుందేమో గానీ ఫైట్స్ లో కొత్తగా ఏం చూపిస్తారు. 40, 50 సంవత్సరాల నుంచీ జనం అవే ఉత్తుత్తి ఫైట్లు చూస్తూనే ఉన్నారు. చెప్పటం మర్చిపోయా. ఈ రోజు ఫలానా సినిమాకి సంబంధించిన అప్డేట్ వస్తుంది అని ముందుగా ప్రచారం చేస్తారు. ఏంటా అప్డేట్ అని ఆసక్తిగా చూస్తే ఫలానా తేదీన ట్రైలర్ వస్తుంది, ఇదే ఆ అప్డేట్ అంటూ చావు కబురు చల్లగా చెబుతున్నారు. ఇవీ.. ప్రస్తుతం మన సినిమావాళ్లు చూపిస్తున్న సినిమాలు. ప్రిరిలీజ్ ఫంక్షన్లు, సక్సెస్ మీట్లు, సక్సెస్ టూర్లు, పబ్లిక్ టాక్, సెలెబ్రిటీ టాక్, స్పెషల్ ఇంటర్వ్యూలు, చిట్ చాట్ లు.. ఇలా చెప్పుకుంటూపోతే చాలానే ఉన్నాయి. కాబట్టి ఇక ఇక్కడితో శుభం కార్డు వేసేద్దాం.

Advertisement