Cinema : థియేటర్లు బంద్. కానీ.. ఆ సినిమా నడిచేవి తప్ప..

Cinema : తెలంగాణ రాష్ట్రం క్రమంగా లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తున్నట్లనిపిస్తోంది. ఇప్పటికే మెడికల్ కాలేజీలు మినహా విద్యా సంస్థలను బంద్ చేశారు. తర్వాత రాత్రి పూట కర్ఫ్యూకి తెర లేపారు. ఇప్పుడు సినిమా థియేటర్లలో వెండి తెరను దింపేశారు. అయితే సినిమా హాళ్లను బంద్ చేయాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు, ఆదేశాలేమీ ఇవ్వకపోవటం, ఎగ్జిబిటర్లు-డిస్ట్రిబ్యూటర్లు తమకుతాముగా ఈ నిర్ణయాన్ని ప్రకటించటం విశేషం. ఇవాళ మంగళవారం రాత్రి 9 గంటల నుంచే కర్ఫ్యూ అమల్లోకి రావటం, దానివల్ల సెకండ్ షోని నిలిపేయాల్సి ఉండటంతో థియేటర్ల నిర్వహణపై ఎగ్జిబిటర్లు-డిస్ట్రిబ్యూటర్లు ఇవాళ సమావేశమై చర్చించారు. రేపు బుధవారం నుంచి మూవీ మహల్స్ అన్నింటినీ మూసివేయనున్నట్లు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. కానీ.. ఆ ఒక్క చిత్రాన్ని ప్రదర్శించే థియేటర్లను మినహాయించటం వి‘‘చిత్రం’’గా ఉంది.

Cinema : from tomorrow movie theatres close in telangana
Cinema : from tomorrow movie theatres close in telangana

‘వకీల్ సాబ్’..

కరోనా వ్యాప్తిని, ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు తెలిపారు. అయితే ‘వకీల్ సాబ్’ పిక్చర్ ని ప్రదర్శించే థియేటర్లను మినహాయించి మిగతా హాళ్లను మూసేయాలని నిర్ణయించటం చర్చనీయాంశంగా మారింది. అంటే ఆ ఫిల్మ్ ని చూస్తే కొవిడ్-19 సోకదా అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. అంతేనా లేక ‘వకీల్ సాబ్’కి పెట్టిన పెట్టుబడి ఇంకా రాలేదా అని కూడా అడుగుతున్నారు. థియేటర్లు బంద్ చేయాలనే నిర్ణయం మంచిదే అయినప్పటికీ ఇలాంటి మినహాయింపులు ఇవ్వటమే బాగలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

‘రాజు’ తలచుకుంటే.. : Cinema

నైట్ కర్ఫ్యూ వల్ల మహాఅయితే మార్నింగ్ షో, మ్యాట్నీ షో మాత్రమే ప్రదర్శించటానికి వీలుంది. ఫస్ట్ షోకి పూర్తిగా ఛాన్స్ లేదు. ఒక వేళ షో టైమింగ్స్ ని కొంచెం ముందుకు జరిపినా పొద్దున్నే తొమ్మిది, పది గంటలకే సినిమాకి వచ్చేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అసలే ఈ రోజుల్లో థియేటర్లకి వచ్చేవాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. అందువల్ల మూడు షోలు వేసినా గిట్టుబాటయ్యే పరిస్థితి ఎగ్జిబిటర్స్ కి గానీ డిస్ట్రిబ్యూటర్స్ కి గానీ లేదు. కాబట్టే పూర్తిగా మూతపెట్టాలని తీర్మానం చేశారు. ‘వకీల్ సాబ్’కి మాత్రం ఎందుకు మినహాయింపు ఇచ్చారంటే ఆ మూవీ నిర్మాత దిల్ రాజు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు ‘ఆయన ఏది చెబితి అది’ అనేవాళ్లే మెజారిటీగా ఉన్నారని, కాబట్టే ‘వకీల్ సాబ్’కి మినహాయింపు లభించిందని ప్రచారం జరుగుతోంది. ఏపీలో ప్రీమియర్ షోలు, టికెట్ల రేట్ల పెంపు వంటి అంశాల్లోనూ ‘వకీల్ సాబ్’ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. అంతేకాదు. ఏపీలో థియేటర్ల బంద్ కి సంబంధించి ఎలాంటి అప్డేటూ లేదు.

Advertisement