Chaurasiya: చౌరాసియాపై దాడి చేసిన వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వెలుగులోకి సంచ‌ల‌న నిజాలు

Chaurasiya: సినీ నటి శాలు చౌరాసియా పై దాడి విష‌యం తెలుగు రాష్ట్రాల‌లో కలకలం రేపిన విషయం తెలిసిందే. కొండాపూర్‌లో ఉండే శాలు చౌరాసియా తెలుగు, తమిళం సినిమాల్లో నటించారు. ఆమె ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు కేబీఆర్‌ పార్కుకు ఆనుకుని ఉన్న ట్రాక్‌లో వాకింగ్‌ చేసేందుకు వచ్చారు. గంటన్నర పాటు వాకింగ్‌ చేసి ఓ చోట నిలబడ్డారు. ఇంతలో ఓ ఆగంతకుడు ఆమెపై దాడి చేసి సెల్ ఫోన్ దొంగిలించి వెళ్లాడు.

TheNewsQube-
chourasiya case solved2
chourasiya case solved2

గ‌త కొద్ది రోజులుగా ఈ కేసు విష‌యంపై జోరుగా ప్ర‌చారాలు న‌డుస్తున్న క్ర‌మంలో సినీ నటిపై దుండగుడి దాడి మిస్టరీని పోలీసులు ఛేదించారు. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఘటన జరిగిన అయిదు రోజుల్లోనే ఛేదించారు. నిందితుడు తెలుగు చలన చిత్రపరిశ్రమలో లైట్‌మెన్‌గా పని చేస్తున్న కె.బాబు (30)గా గుర్తించి శుక్రవారం మధ్యాహ్నం బంజారాహిల్స్‌ రోడ్‌ నం.2లోని ఇందిరానగర్‌లో అదుపులోకి తీసుకున్నారు.

చోరీ చేసిన సెల్‌ఫోనే నిందితుడిని పట్టించడం గమనార్హం. ఈ ఘటనను సవాల్‌గా తీసుకున్న వెస్ట్‌ జోన్, నార్త్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్, బంజారాహిల్స్‌ పోలీసులు బృందాలుగా ఏర్పడి అటు సీసీ కెమెరాలతో పాటు ఇటు సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ను జల్లెడ పట్టాయి. ఆదివారం రాత్రి 11.40 గంటల ప్రాంతంలో నిందితుడు ఇందిరానగర్‌ ప్రాంతంలో సెల్‌ ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసినట్లుగా గుర్తించారు నార్త్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు .

ఆ ఒక్క ఆధారంతో సాంకేతికతను ఉపయోగించి నిందితుడిని పట్టుకున్నారు. కృష్ణానగర్, ఇందిరానగర్‌ మధ్యలో గది అద్దెకు తీసుకొని ఉంటున్న కె.బాబు సినీ పరిశ్రమలో లైట్‌మెన్‌గా పని చేస్తున్నట్లుగా తేలింది. నిందితుడు ఆ రోజు వేసుకున్న షర్ట్, ప్యాంట్‌ కలర్‌ ఆధారంగా ఊహా చిత్రాన్ని తయారు చేసిన నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురు, శుక్రవారాల్లో ఇందిరానగర్, కృష్ణానగర్‌ ప్రాంతాల్లో సినీ కార్మికులు ఉండే ప్రాంతాలను జల్లెడపట్టారు.

chourasiya case solved1
chourasiya case solved1

ఎట్టకేలకు ఆరోజు నిందితుడు వేసుకున్న షర్ట్‌ను గుర్తించిన సహచరులు పోలీసులకు తగిన ఆధారాలు అందజేశారు. దీంతో పోలీసులు నిందితుడి గదిలో ఉండగానే రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సెల్‌ఫోన్‌ దొరకడంతో అతడే నిందితుడని నిర్ధారించారు.ఆ రోజూ సీసీ కెమెరాలు లేనిచోట, చీకటి ఉన్న ప్రాంతాన్ని గుర్తించి ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక అత్యాచార యత్నానికి పాల్పడినట్లుగా తెలిపాడు. దొంగతనానికి రాలేదని, అత్యాచారం చేయడానికే వచ్చినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో నిందితుడు వెల్లడించినట్లు తెలిసింది