Sekhar Master: శేఖర్ మాస్టర్.. సూపర్..

Sekhar Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తన మూలాలను మర్చిపోలేదు. ఒకప్పుడు ఎంతో కష్టపడి పైకొచ్చిన ఆయన కరోనా నేపథ్యంలో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేద డ్యాన్సర్లను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. రోజువారీ సరుకులు కొనటానికి కూడా చేతిలో డబ్బులు లేనోళ్లు తనను సంప్రదించాలని కోరారు. సోషల్ మీడియా వేదికగా మూడు ఫోన్ నంబర్లు ఇచ్చారు. ఈ మేరకు ఇవాళ శనివారం ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియో పెట్టారు. లాక్ డౌన్ కారణంగా ఇతర ప్రాంతాల్లో ఉన్నవారికి నిత్యవసరాలను పంపించలేనని, హైదరాబాద్ లో ఉన్నవారికైతే సాయం చేస్తానని స్పష్టం చేశారు. బయట పరిస్థితి చాలా చాలా దారుణంగా, దరిద్రంగా ఉంది కాబట్టి అత్యవసరం అయితే తప్ప 24 గంటలూ ఇంట్లోనే ఉండాలని రిక్వెస్ట్ చేశారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. స్టే హోమ్ స్టే సేఫ్ అని చెప్పారు.

Sekhar Master

వీడియోలో ఏమన్నారంటే..

‘‘నమస్కారమండి. ఇప్పుడు లాక్డౌన్ జరుగుతోంది. కొన్ని రోజులుగా మా డ్యాన్సర్లకు వర్క్ లేదు. ఏ కార్యక్రమంలోనైనా గ్రూప్ డ్యాన్సర్స్ ను పెడితేనే వాళ్లకు వర్క్ ఉంటుంది. అలాగే షోస్ చేసే డ్యాన్సర్లకి కూడా వర్క్ లేదండి. ఆడియో ఫంక్షన్లు గానీ సంగీత్ లు గానీ మ్యారేజ్ లు గానీ ఉంటేనే వాళ్లకు వర్క్ ఉంటుంది. అలాంటివేవీ ఇప్పుడు జరగట్లేదు కాబట్టి వాళ్లు చాలా బాధపడుతున్నారు. నేను మొన్న ఓ వీడియో చూశాను. షోస్ లేకపోవటం వల్ల అమౌంట్ కి ప్రాబ్లం అవుతోందని కొందరు చెప్పారు. ఇంట్లో ఫుడ్ కి ఇబ్బందిగా ఉందని ఆవేదన చెందారు. ఏ డ్యాన్సరైనా మూవీ డ్యాన్సరైనా షో చేసే డ్యూన్సరైనా ఎవరికైనా గ్రోసరీస్ అవసరమైతే నేను కింద కొన్ని నంబర్లు ఇస్తున్నాను. వాటికి మీరు కాల్ చేసి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చండి. మావాళ్లు మీకు హ్యాండోవర్ చేస్తారు’’ అని శేఖర్ మాస్టర్ చెప్పారు.

థ్యాంక్యూ అండి..

కొవిడ్-19 వైరస్ సెకండ్ వేవ్ నేపథ్యంలో చెయ్యటానికి పనిలేక, మూడు పూటలా తినటానికి తిండి లేక, పైకి చెప్పులేక, నానా యాతనలు పడేవారు ఎందరో. అలాంటి పేద కళాకారులను ఆదుకుంటానంటూ పెద్ద మనసు చాటుకున్న శేఖర్ మాస్టర్ కి నెటిజన్లు థ్యాంక్స్ చెబుతున్నారు. తనలాగే కింది నుంచి పైకొచ్చేందుకు పోరాడుతున్న ఆర్టిస్టుల్ని ఆయన గుర్తించటాన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నారు. సూపర్ సార్ అంటున్నారు.