CHIRANJEEVI: పొట్టి వీర‌య్య మృతి క‌లిచి వేసింద‌న్న చిరంజీవి.. సంతాపం తెలిపిన ప‌లువురు ప్ర‌ముఖులు

300కి పైగా తెలుగు చిత్రాల‌లో న‌టించి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన న‌టుడు పొట్టి వీర‌య్య‌. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఐదొందలకుపైగా సినిమాల్లో నటించారు. మరుగుజ్జు పాత్రలతో మెప్పించారు.. విఠలాచార్య దర్శకత్వంలో రూపొందిన ‘అగ్గిదొర’ చిత్రంతో వీరయ్య సినీ రంగ ప్రవేశం చేశారు.మహాబలుడు, జగన్మోహిని, రాజసింహా, అగ్గివీరుడు,
గండరగండడుతో పాటు పలు జానపద చిత్రాల్లో హాస్యనటుడిగా కనిపించి మెప్పించారు. సాంఘిక చిత్రాల్లో సంసారం సాగరం, గజదొంగ, యమదొంగ, కొండవీటిరాజా, నేరం నాది కాదు ఆకలిది, పిల్లా పిడుగా, వదినగారి గాజులుతో పాటు పలు విజయవంతమైన చిత్రాల్లో వీరయ్య నటించారు.

తమిళంలో రజనీకాంత్‌తో కలిసి ‘అచ్చమిళై అచ్చమిళై’ సినిమా చేసిన పొట్టి వీరయ్య‌.. ఎన్టీఆర్‌, కాంతారావు కృష్ణ, సావిత్రి, ఎమ్జీఆర్‌, శివాజీగణేషన్‌, రజనీకాంత్‌తో పాటు దక్షిణాది చిత్రసీమలోని అగ్రనటీనటులందరితో క‌లిసి పని చేశారు. ఆయ‌న గ‌త రాత్రి ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో క‌న్నుమూశారు. ఈ రోజు ఆయ‌న అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే వీర‌య్య మృతిపై సానుభూతిని వ్య‌క్త‌ప‌రిచిన చిరు.. జీవితంలో ఎన్నో స‌వాళ్ల‌ను అధిగ‌మించి త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్నారు వీర‌య్య‌. ఆయ‌న మృతి న‌న్ను ఎంత‌గానో క‌లిచి వేసింది. ఆయన కుటుంబ స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను. వీర‌య్య ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని భ‌గ‌వంతుడిని ప్రార్ధిస్తున్నాను అని చిరు పేర్కొన్నారు.

Advertisement