SAAHO:సాహో ద‌ర్శ‌కుడికి మెగా కాంపౌండ్ నుండి మ‌ళ్లీ పిలుపు.. అవ‌కాశాన్ని అందిపుచ్చుకుంటాడా..!

‘రన్ రాజా రన్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సుజీత్.. చ‌క్క‌ని స్క్రీన్ ప్లేతో ప్రేక్ష‌కుల‌ని మెప్పించాడు. సినిమా అంతా చాలా టిపిక‌ల్‌గా ఉండడంతో ప్రేక్ష‌కులు దీనిని బాగానే ఎంజాయ్ చేశారు. ఇక ర‌న్ రాజా న‌ర్ త‌ర్వాత సాహో వంటి భారీ బ‌డ్జెట్ చిత్రం తెర‌కెక్కించే అవ‌కాశాన్ని అందుకున్నాడు. బాహుబ‌లి లాంటి భారీ హిట్ త‌ర్వాత ప్ర‌భాస్.. సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేశాడు. ఈ సినిమాను అత్య‌ద్భుతంగా తెర‌కెక్కించ‌న కూడా ప్రేక్ష‌కులని పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయింది. హిందీలో మాత్రం మంచి ఆద‌ర‌ణ అందుకుంది.

సాహో తర్వాత గ్యాప్ తీసుకున్న టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ సుజీత్.. మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేసే అవకాశం పట్టేశాడు. మలయాళ హిట్ మూవీ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ బాధ్యతలు ముందుగా సుజీత్ కు అప్పగించారు. కొన్ని అనివార్య కారణాలతో సుజీత్ ఈ ప్రాజెక్ట్ నుండి బయటకు రావడంతో.. ఈ సినిమా మోహన్ రాజా చేతికి వెళ్ళింది. దీంతో నిరాశ‌కు గుర‌య్యాడు. అయితే తాజాగా సుజీత్ ఓ మెగా ఆఫ‌ర్ అందుకున్నాడ‌ని ఓ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

చిరుతో మ‌రో త‌మిళ రీమేక్ క‌థ‌ను సుజీత్ సిద్ధం చేస్తున్నాడ‌ని తాజా వార్త కాగా, ఇందులో నిజ‌మెంత ఉంద‌నే దానిపై అభిమానులు ఆరాలు తీస్తున్నారు. అజిత్ – అనుష్క – త్రిష హీరోహీరోయిన్లుగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘ఎన్నై అరింధాల్’. ఏఎమ్ రత్నం నిర్మించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేసే బాధ్యతను సుజీత్ కు అప్పజెప్పారనేది ఈ వార్తల సారాంశం.అయితే ‘ఎన్నై అరింధాల్’ సినిమా 2015 లోనే ‘ఎంతవాడు గాని’ అనే పేరుతో తెలుగులో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాని చూసిన ప్రేక్ష‌కులు మ‌ళ్లీ దానిని రీమేక్ చేస్తే ఒప్పుకుంటారా అనేది చూడాలి.