Waltair Veerayya Review : ‘వాల్తేరు వీరయ్య’ రివ్యూ: పూనకాలు సరిగానే లోడ్ అయ్యాయిగానీ.!

NQ Staff - January 13, 2023 / 08:50 AM IST

Waltair Veerayya Review : ‘వాల్తేరు వీరయ్య’ రివ్యూ: పూనకాలు సరిగానే లోడ్ అయ్యాయిగానీ.!

Waltair Veerayya Review : మెగాస్టార్ చిరంజీవి కంప్లీట్ కమర్షియల్ జోన్‌లో చేసిన సినిమా కావడంతో ‘వాల్తేరు వీరయ్య’పై అంచనాలు భారీగానే వున్నాయి విడుదలకు ముందు. పైగా, ఈ సినిమాలో రవితేజ ఓ కీలక పాత్ర పోషించడం, సినిమాపై అంచనాలు మరింత పెరగడానికి కారణమైంది. చిరంజీవి వీరాభిమాని బాబీ, తన అభిమాన నటుడ్ని తెరపై ఎంత అద్భుతంగా చూపించాడోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూశారు. ఇంతకీ, ‘వాల్తేరు వీరయ్య’ కథా కమామిషు ఏంటి.? తెలుసుకుందాం పదండిక.

కథేంటంటే..
వాల్తేరు ప్రాంతానికి చెందిన ఫిషర్ మెన్ వీరయ్య. ఓ కేసులో వీరయ్యని పోలీసులు అరెస్ట్ చేస్తారు. వేరే ఫిషర్ మెన్ చేసిన పనికి తాను అరెస్టయ్యానని తెలుసుకున్న వీరయ్య, అసలు ఆ డ్రగ్స్ కేసు సంగతి తేల్చే పనిలో పడతాడు. అది మిగతా కథ.

నటీనటుల పనితీరు..
మెగాస్టార్ చిరజీవి.. 150కి పైగా సినిమాల్లో నటించిన చిరంజీవి నటన గురించి కొత్తగా చెప్పేదేముంది.? కాకపోతే, వింటేజ్ మెగాస్టార్‌ని మళ్ళీ తెరపై చూస్తాం. ఆ ఎనర్జీ, ఆ స్టైలింగ్, ఆ హ్యూమర్.. వాట్ నాట్. దాదాపు అన్ని యాంగిల్స్‌లోనూ పూనకాలు లోడింగ్ అని చెప్పొచ్చు. అభిమానులకైతే ఐ ఫీస్ట్.!

గతంలో ‘అన్నయ్య’ సినిమాలో చిరంజీవితో కలిసి నటించిన రవితేజ, చాన్నాళ్ళ తర్వాత చిరంజీవితో కలిసి స్క్రీన్ మీద కనిపించాడు. ఈ ఇద్దరూ కలిసిన ప్రతిసారీ అభిమానులు పూనకాలు లోడింగ్.. అనే ఫీల్ అవుతారు. తన పాత్రకు రవితేజ పూర్తి న్యాయం చేశాడు.

శృతిహాసన్ బాగానే చేసింది. కానీ, ఆమె పాత్ర ఫస్టాఫ్‌కే పరిమితం అన్నట్లుగా వుంటుంది. కమెడియన్లలో వెన్నెల కిషోర్ బాగా చేశాడు. మిగతావారంతా వృధా అయ్యారు. ప్రకాష్ రాజ్ గతంలో ఇలాంటి రోల్స్ చాలానే చేశాడు. అతని పాత్రలో కొత్తదనం ఏమీ లేదు.

సాంకేతికవర్గం పనితీరు..
ముందుగా ఆర్ట్ వర్క్ గురించి చెప్పుకోవాలి. ‘బాస్ పార్టీ’ సాంగ్‌లో ఆ ఆర్ట్ వర్క్ మరింత బాగా ఎలివేట్ అయ్యింది. మూడు పాటలు తెరపై చూడ్డానికి బావున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే వుంది. సెకెండాఫ్‌లో ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా వుండాల్సింది. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. నిర్మాణపు విలువల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా రాజీ పడలేదు.

ప్లస్ పాయింట్స్
మెగాస్టార్ చిరంజీవి
రవితేజ
ఫస్టాఫ్

మైనస్ పాయింట్స్
సెకెండాఫ్‌లో సాగతీత
క్లయిమాక్స్‌కి ముందు వచ్చే పాట

విశ్లేషణ
ఈ సంక్రాంతికి ఓకే అనిపించే కమర్షియల్ ఎంటర్టైనర్‌గా ‘వాల్తేరు వీరయ్య’ గురించి చెప్పొచ్చు. తన అభిమాన హీరోని తెరపై ఎలా చూడాలనుకున్నాడో, అలా దర్శకుడు బాబీ, చిరంజీవిని ఈ సినిమాలో చూపించాడు. చిరంజీవి మేగ్జిమమ్ ఎనర్జీతో కనిపించడం అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది. రవితేజని చిరంజీవితో కలిసి చూడటం, ఆ ఇద్దరి మధ్యా ఎమోషనల్ సీన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. సంక్రాంతి పండగ నేపథ్యంలో మంచి కమర్షియల్ విజయాన్ని ‘వాల్తేరు వీరయ్య’ అందుకునే అవకాశాలు లేకపోలేదు. సెకెండాఫ్‌లో రేసీ స్క్రీన్‌ప్లే వుంటే సినిమా వేరే లెవల్‌కి ఖచ్చితంగా వెళ్ళి వుండేది.

రేటింగ్: 2.5/5

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us