Chiranjeevi: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి, ఏపీ ప్రభుత్వానికి మధ్య ఎంతటి వార్ నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ ప్రముఖులపై మంత్రులు తప్పుడు కామెంట్స్ చేయడంతో వారు కూడా ఎదురు దాడి చేస్తున్నారు. ఎన్వీ ప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ్ తాజా సంఘటనలపై చాలా సీరియస్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల నడుమ నేడు మెగాస్టార్ చిరంజీవి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని కలవబోతున్నట్టు ప్రచారం నడుస్తుంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నేడు మెగాస్టార్ చిరంజీవి కలవనున్నారు. ఈమేరకు చిరంజీవికి జగన్ అపాయింట్ మెంట్ లభించింది. ఈరోజు నేరుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చిరంజీవి వెళ్లనున్నారు. మధ్యాహ్నా భోజన విరామ సమయంలో కలిసేందుకు అపాయింట్‌మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
ఈ రోజు మధ్యాహ్నం మర్యాదపూర్వక లంచ్ భేటీ జరగనుంది. సినీ పరిశ్రమకు సంబంధించి పలు అంశాలు ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి సీఎం జగన్‌తో భేటీ కానున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై ఆయన చర్చించే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ సినిమారంగానికి చెందిన పెద్దలు ఎవరూ జగన్ ను కలవలేదు. చిరంజీవి కూడా సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపు అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్ ను టాలీవుడ్ గుర్తించడం లేదన్న విమర్శలు కూడా ఇటీవల కాలంలో వైసీపీ నేతల నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ను కలిసేందుకు చిరంజీవి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది