Rajinikanth: చివ‌రికి ర‌జ‌నీకాంత్ కూడా చిరంజీవి టైటిల్‌పై క‌న్నేసాడుగా..!

Rajinikanth: రజనీకాంత్ ప్రస్తుతం అన్నాతే సినిమాతో బిజీగా ఉన్నాడు. చాలా రోజుల విరామం తర్వాత ఈ మధ్య మళ్ళీ మొదలైంది సినిమా షూటింగ్. శౌర్యం శివ ఈ సినిమాకు దర్శకుడు. తమిళంలో వరుసగా అజిత్ హీరోగా సినిమాలు చేస్తూ విజయాలు అందుకున్న శివ.. తొలిసారి రజనీకాంత్ తో పని చేస్తున్నాడు. చాలా సంవత్సరాలుగా రజనీ కూడా పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్ ఇవ్వలేకపోతున్నారు. అభిమానులకు ఈయన చాలా బాకీ పడిపోయాడు.

Rajinikanth

ఇలాంటి సందర్భంలో అభిమానుల అంచనాలు అన్నాతే సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమాతో కచ్చితంగా సూపర్ హిట్ అందుకుంటామని రజనీ కూడా ధీమాగా ఉన్నాడు. ఎన్నో బ్రేకుల మధ్య సాగుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దాదాపు 90శాతంకి పైగా షూటింగ్ పూర్తి కావడంతో నిర్మాతలు ఊపిరిపీల్చుకున్నారు. ఇంకా చివరి షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది.

దాంతో పాటు మరికొన్ని చిన్న చిన్న వర్కులు పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి సినిమాను అక్టోబర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్కతాలో ప్రస్తుతం రజనీకాంత్ సినిమా షూటింగ్ జరుగుతుంది. దీని కోసం టీం మొత్తం బెంగాల్ కు వచ్చింది. గతంలో వేదాళం సినిమాను కూడా ఎక్కువభాగం కోల్ కత్తాలోనే తెరకెక్కించాడు శివ. ఇప్పుడు మరోసారి రజనీకాంత్ కోసం సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు. ఇందులో జగపతిబాబు, కుష్బూ, నయనతార, కీర్తి సురేష్, మీనా లాంటి స్టార్స్ నటిస్తున్నారు. ఒకే సినిమాలో ఇంత మందిని కలిపి చూపిస్తున్నాడు శివ.

Rajinikanth

ఇదిలా ఉంటే ఈ సినిమాకు చిరంజీవి సూపర్ హిట్ టైటిల్ పెట్టాలని చూస్తున్నారు. అదే అన్నయ్య.. 2000 సంవత్సరంలో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. మిలీనియం మొదటి బ్లాక్ బస్టర్ గా అన్నయ్య చరిత్ర సృష్టించింది. అలాంటి టైటిల్ రజిని సినిమా కోసం ఆలోచిస్తున్నారు దర్శక నిర్మాతలు. అన్నాత్తే అంటే అన్నయ్య అని అర్థం. దాంతో అదే టైటిల్ రజినీకాంత్ ఇమేజ్ కు బాగా సరిపోతుంది అనుకుంటున్నారు మేకర్స్. ఈ మధ్య చిరంజీవి పాత టైటిల్స్ తో చాలా సినిమాలు వచ్చాయి. తమిళ హీరో కార్తీ దొంగ, ఖైదీ టైటిల్స్ వాడుకున్నాడు. మొన్న కార్తికేయ రాజా విక్రమార్క అంటూ వచ్చాడు. ఇప్పుడు రజినీకాంత్ అన్నయ్య అంటున్నాడు. మరి ఇది ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.