Chiranjeevi: సాయిధరమ్ తేజ్ ని తలచుకుంటూ ఎమోషనల్ అయిన చిరంజీవి

Chiranjeevi: సెప్టెంబర్ 10న రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు నటుడు సాయిధరమ్‌ తేజ్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రిపబ్లిక్‌’. దేవకట్టా దర్శకత్వం వహించిన ఈసినిమాలో సాయితేజ్‌ కలెక్టర్‌గా పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారు. ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటించగా, చిత్రాన్ని అక్టోబర్ 1న విడుదల చేస్తున్నారు.

అవినీతి రాజకీయాల కారణంగా ప్రజలు ఎలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలియజేసేలా ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో కలెక్టర్‌ పాత్రలో సాయి చెప్పే డైలాగ్‌లు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ‘సమాజంలో తిరిగే అర్హతే లేని గుండాలు పట్టపగలే బాహటంగా అమాయకుల ప్రాణాలు తీస్తుంటే.. కంట్రోల్‌ చేయాల్సిన వ్యవస్థలే వాళ్లకు కొమ్ము కాస్తున్నాయ్‌’ అంటూ సాయి చెప్పే డైలాగ్‌లు మెప్పించేలా ఉన్నాయి. మరోవైపు రమ్యకృష్ణ, జగపతిబాబు కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమంలో చిరంజీవి చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. ‘సాయిధరమ్ తేజ్ ఆ భ‌గ‌వంతుడు దీవెన‌ల‌తో, ప్రేక్ష‌కాభిమానులందరి ఆశీస్సుల‌తో హాస్పిట‌ల్‌లో త్వ‌ర‌గా కోలుకుంటున్నాడు. త‌న హీరోగా చేసిన రిప‌బ్లిక్ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డం కాస్త ఎమోష‌న‌ల్‌, హెవీగా అనిపిస్తుంది. త్వ‌ర‌లోనే సాయితేజ్ మ‌న మ‌ధ్య‌కు వ‌స్తాడు. ఇక దేవ క‌ట్టాగారు డైరెక్ష‌న్ చేసిన ఈ సినిమా ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే.. చూస్తుంటే నాకు గూజ్‌బంప్స్ వ‌స్తున్నాయి.

ఓ యంగ్ క‌లెక్ట‌ర్ రౌడీయిజాన్ని అరిక‌ట్ట‌డానికి ప్ర‌య‌త్నం చేయ‌డం, ప్ర‌జ‌ల‌కు ఎలాంటి రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ను ఎన్నుకోవాలో తెలియ‌జేప్పే ప్ర‌య‌త్నం చూస్తుంటే అంద‌రినీ ఎడ్యుకేట్ చేస్తున్న సినిమాలా అనిపిస్తుంది. స‌బ్జెక్ట్ విష‌యంలో దేవ క‌ట్టాగారి నిజాయ‌తీ సుస్ప‌ష్టంగా తెలుస్తుంది. సాయితేజ్ డైన‌మిక్‌గా, సెటిల్డ్‌గా క‌నిపిస్తున్నాడు. క‌మ‌ర్షియ‌ల్‌గా సినిమా అంద‌రినీ మెప్పిస్తుంద‌ని అర్థ‌మ‌వుతుంది. ఇలా హానెస్ట్ సినిమాకు నిర్మాత‌లు పుల్లారావుగారు, భ‌గ‌వాన్‌గారు కూడా పూర్తి స‌హకారం అందించారు.

వ్యాపార‌త్మ‌కంగానే కాదు, వినోదాత్మ‌కంగానే కాదు, అంద‌రినీ అల‌రించే ఎడ్యుకేటివ్ మూవీగా వారు రిప‌బ్లిక్‌ను అంద‌రినీ అల‌రించేలా రూపొందించి మ‌న ముందుకు తీసుకువ‌స్తున్నారు. నిర్మాత‌ల ప్ర‌య‌త్నాన్ని నేను మ‌న‌స్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్ర‌జ‌లు, ప్రేక్ష‌కులు కూడా వారి ప్ర‌య‌త్నాన్ని ఆశీర్వ‌దిస్తార‌ని న‌మ్ముతున్నాను. ఆలోచ‌న రేకెత్తించే ఇలాంటి సినిమాలు రావాలి. ఓట‌ర్స్‌లో ఓ రెవల్యూష‌న్ రావాలని యూనిట్ చేసిన ప్ర‌య‌త్నాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను. రిప‌బ్లిక్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డం గొప్ప అవ‌కాశంగా భావిస్తున్నాను. జీ త‌ర‌పున ఇలాంటి సినిమాకు బ్యాకింగ్‌గా నిల‌బ‌డ్డ నా చిర‌కాల మిత్రుడు ప్ర‌సాద్‌గారికి థాంక్స్‌. ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది వెరీ బెస్ట్‌’’ అన్నారు.