KAKARLA: నిమ్స్ మాజీ డైరెక్ట‌ర్ కాకర్ల మృతి.. సంతాపం తెలియ‌జేసిన చిరంజీవి, కేసీఆర్, ఉప‌రాష్ట్ర‌ప‌తి

నిమ్స్ మాజీ డైరెక్ట‌ర్, ప్ర‌ముఖ వైద్యుడు కాక‌ర్ల సుబ్బారావు కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్ర‌వారం ఉదయం తుదిశ్వాస విడిచారు. నెల రోజులుగా ఆయ‌న ఆసుప‌త్రిలో చికిత్స పొందుతుండ‌గా, ఈ రోజు ప‌రిస్థితి విష‌మించి క‌న్నుమూసారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వైద్య రంగానికి కాక‌ర్ల చేసిన సేవ‌లు మ‌ర‌వ‌లేనివి. ఆయ‌న మృతికి సీఎం కేసీఆర్, మెగాస్టార్ చిరంజీవి, ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు సంతాపం తెలియ‌జేశారు.

సుబ్బారావు 1925లో కృష్ణా జిల్లా పెదముత్తేవిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. పాఠ‌శాల విద్యాబ్యాసం చ‌ల్ల‌ప‌ల్లిలో, మచిలీప‌ట్నంలో క‌ళాశాల విద్యాబ్యాసం చేశారు. 1951లో హౌస్‌ సర్జన్‌ చేసిన తర్వాత వైద్యంలో ఉన్నత విద్య కోసం ప్రత్యేక పారితోషికంతో అమెరికా వెళ్లారు .న్యూయార్క్‌, బాల్టిమోర్‌ నగరాల్లోని ఆసుపత్రుల్లో 1954 నుంచి 56 వరకు పనిచేశారు. 1956లో స్వదేశానికి తిరిగి వచ్చి హైదరాబాద్‌లోని ఉస్మానియా వైద్య కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ప‌నిచేశారు. ఉస్మానియా క‌ళాశాల‌లోనే ప్ర‌ధాన రేడియాల‌జిస్ట్‌గా ప‌దోన్న‌తి పొందిన ఆయ‌న హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రి డైరెక్టర్‌గా సేవలందించారు. కార్పొరేట్ ఆస్ప‌త్రుల‌కు ధీటుగా నిమ్స్‌ను తీర్చిదిద్దిన కాక‌ర్ల 2000 సంవ‌త్స‌రంలో ప‌ద్మ శ్రీ అవార్డు అందుకున్నారు.

ఆయ‌న మృతికి కేసీఆర్ సంతాపం ప్ర‌క‌టించారు. నిమ్స్ డైరక్టర్ గా ఆయన చేసిన కృషి గొప్పదన్నారు. కాకర్ల కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాక‌ర్ల సుబ్బారావు మృతిప‌ట్ల ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎం. వెంక‌య్య నాయుడు సంతాపం తెలిపారు. వైద్య‌రంగానికి కాక‌ర్ల సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని, ఆయ‌న సేవానిర‌తి, అంకిత‌భావం వైద్యుల‌కు ఆద‌ర్శ‌నీయ‌మ‌ని చెప్పారు. పేద‌ల‌కు నాణ్య‌మైన వైద్యం అందించేందుకు కృషిచేశార‌ని పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా కాక‌ర్ల మృతిప‌ట్ల సంతాపం తెలియ‌జేశారు. కాక‌ర్ల మృతి నన్ను బాధించింది. రేడియాల‌జిస్టే కాదు, దూర‌దృష్టి గ‌ల వ్య‌క్తి. నిమ్స్‌ను దేశంలో ప్రీమియ‌ర్ వైద్య సంస్థ‌గా మార్చారు. ఆయ‌న మృతికి సంతాపం తెలియ‌జేస్తున్నాను అని ట్వీట్‌లో పేర్కొన్నారు చిరు.

Advertisement