Chiranjeevi: ఆచార్య‌లో రామ్ చ‌ర‌ణ్ అయితే, లూసిఫ‌ర్ రీమేక్‌లో గెస్ట్ రోల్ ఎవ‌రో తెలుసా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి యువ హీరోలతో పోటీ ప‌డి మ‌రీ సినిమాలు చేస్తున్నారు. రీ ఎంట్రీ త‌ర్వాత ఖైదీ నెంబ‌ర్ 150,సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన చిరు త్వ‌ర‌లో ఆచార్య అనే సినిమాతో ప‌ల‌కరించ‌నున్నాడు. కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఆచార్య చిత్రం ఎప్పుడో విడుద‌ల కావ‌ల‌సి ఉన్న‌ప్ప‌టికీ, క‌రోనా వ‌ల‌న ప‌లుమార్లు వాయిదా ప‌డింది. మే 13న ఈ చిత్రం విడుద‌ల కావ‌ల‌సి ఉంది. సెకండ్ వేవ్ వ‌ల‌న మ‌ళ్లీ వాయిదా వేశారు. ఈ సినిమా షూటింగ్ ప‌ది రోజులు ఉండ‌గా, ఇది పూర్తైన త‌ర్వాత చిరు మలయాళంలో 100 కోట్లు వసూలు చేసిన ‘లూసిఫర్’ చిత్రాన్ని రీమేక్ చేయ‌నున్నారు.

లూసిఫ‌ర్ లో మోహ‌న్ లాల్ చేసిన పాత్ర త‌న తండ్రికి బాగుంటుంద‌ని భావించిన రామ్ చ‌ర‌ణ్ మూవీ రీమేక్ రైట్స్ ద‌క్కిచుకున్నారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని రీమేక్ స్పెష‌లిస్ట్ మోహన్ రాజాకు అప్ప‌గించారు. చిరు నటించబోయే ఈ 153వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్ప‌టికే రాగా, దీనికి సంబంధించి అనేక ప్ర‌చారాలు న‌డుస్తున్నాయి. చిత్రంలో
విదేశాల నుంచి వచ్చి ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడే యువకుడి పాత్ర ఉంటుంది. ఇది హీరో చెప్పినట్లు నడుచుకునే తమ్ముడి పాత్ర. మ‌ల‌యాళంలో ఆ పాత్ర‌ని యాక్టర్ టోవినో థామస్ చేయ‌గా, తెలుగు వ‌ర్షెన్‌లో వ‌రుణ్ తేజ్ చేయ‌నున్నాడ‌ట‌. పెద‌నాన్న సినిమాలో చిన్న పాత్ర చేయాల‌ని ఎప్ప‌టి నుండో భావిస్తుండ‌గా, వ‌రుణ్ తేజ్‌కి ఇప్పుడు ఆఫ‌ర్ వ‌చ్చింద‌నే అనుకోవాలి.

ఆచార్య‌లో రామ్ చ‌ర‌ణ్ చేత గెస్ట్ రోల్ చేయించిన చిరు లూసిఫ‌ర్ రీమేక్‌లో వ‌రుణ్ తేజ్‌తో చేయిస్తున్నాడ‌న్న‌మాట‌. మ‌రి రానున్న చిత్రాల‌లో ఏఏ మెగా హీరోల‌ను దింపుతాడో చూడాలి. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ – సూపర్ గుడ్ ఫిలిమ్స్ – ఎన్వీఆర్ సినిమా బ్యానర్స్ కలిసి లూసిఫ‌ర్ రీమేక్ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆర్.బి చౌదరి – ఎన్.వి.ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. లక్ష్మీ భూపాల్ సంభాషణలు రాస్తున్నారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా రీమేక్ స‌న్నాహాలు చేస్తుండ‌గా, అతి త్వ‌ర‌లోనే మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తుంది.