Chiranjeevi : బాలు మ‌నంద‌రికి అన్యాయం చేసి వెళ్లారు.. ఎమోష‌న‌ల్ అయిన చిరంజీవి

Chiranjeevi: త‌న గాత్రంతో వేలాది పాట‌ల‌కు ఊపిరిపోసిన గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్య‌ణ్యం. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యంను ముద్దుగా బాలు అని పిలుచుకుంటారు. నెల్లూరులో జ‌న్మించిన బాలు దేశ వ్యాప్తంగా పాపుల‌ర్ అయ్యాయి. త‌న గాత్రంతో వెలాది పాటలకు ఊపిరి పోసిన బాలు ఆ నాటి హీరోలనుంచి నేటి తరం హీరోల స‌క్సెస్ లో స‌గ‌భాగం అయ్యారు. 1966 లో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా మొదలైన బాలసుబ్రహ్మణ్యం ప్రస్థానం ఎందరికో ఆదర్శం. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకు పైగా పాటలను ఆలపించారు బాలు.

చాలామంది హీరోలకు వారి స్టైల్ లోనే గొంతును మిమిక్రీ చేస్తూ పాటలు పాడారు బాలు. సింగర్ గానే కాదు నటుడిగా ను ఆయన తన ప్రతిభను కనబరిచారు. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ లాంటి వాళ్ళకి గాత్రదానం చేసారు. దశావతారం చిత్రంలో కమల్ పోషించిన పది పాత్రల్లో 7 పాత్రలకు బాలునే డబ్బింగ్ చెప్పడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి సూప‌ర్ హిట్ చిత్రాల‌లో బాలు అద్భుత‌మైన పాటలు ఆల‌పించారు. ఆయ‌న పాట‌ల‌కు మెగాస్టార్ స్టెప్పులు వేస్తుంటే అభిమానులు తెగ మురిసిపోయేవారు. బాలుకు, చిరుకు మ‌ధ్య మంచి అనుబంధం ఉండేది. ‘ఓ సందర్భంలో ‘ఎస్పీ బాలు గారూ’అని చిరంజీవి సంబోధిస్తే.. ఆయన ఎంతో బాధ పడ్డారట‌. ఎప్పుడూ నోరారా అన్నయ్య అనేవాడివి ఇవాళ బాలు గారూ అంటూ మర్యాదగా పిలిచి నన్ను దూరం చేస్తున్నావా అంటూ చిరు కోపం ప్ర‌ద‌ర్శించార‌ట‌.

ఈ విష‌యాన్నినేడు బాల జ‌యంతి సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు చిరు. మీ ఔన్నత్యం తెలిశాక మీలాంటి వారిని బాలు గారు అని పిల‌వాల‌ని అనిపిస్తుంది త‌ప్ప‌ ఏకవచనంతో సంబోధించడం సరికాదనుకుంటున్నానని చెప్పాను. అప్పుడు ఆయ‌న అలా పిలిచి నన్ను దూరం చెయ్యకయ్యా అన్నారు. కానీ, ఇవాళ మనందరికీ అన్యాయం చేసి ఆయన దూరమయ్యారు’ అంటూ చిరంజీవి ఎమోషనల్‌ అయ్యారు. అంతేకాక త‌న సోష‌ల్ మీడియాలో ఎస్పీ బాలు సోదరి ఎస్పీ వసంత ఆలపించిన ఓ పాటను కూడా పొందుపరిచారు. ‘అనితర సాధ్యుడు, మహా గాయకుడు, ప్రియ సోదరుడైన బాలు గారికి ఓ చెల్లి అశ్రు నీరాజనం..మనందరినీ శోక సముద్రంలో ముంచి ఇంత త్వరగా వీడి వెళ్లిన ఆ గాన గంధర్వుడి 75 వ జన్మ దిన సంధర్బంగా ఈ స్మృత్యంజలి..వినమ్ర నివాళి ! ’అంటూ చిరంజీవి త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.